Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Monday, April 4, 2011

చెల్లని నోటు


"పోదు" అన్నాడు ఆటో వాడు,నేనిచ్చిన 5 రూపాయల నోటుని చూసి....
"ఏంది పోదు,ఎందుకు పోదు,......."అని నేను ఇంకేదో అనబోతుంటే నన్ను ఒక రకంగా చూసి,..."పోతేలేవన్నా ఇవి,చెల్లుతలేవు,..వేరేదియ్యి.."అన్నాడు కొంచెం నిర్లక్ష్యంగా....... సరే తీ అని చెప్పి వేరే నోటు పారేసి వచ్చేసిన....
అట్లనే
దుఖాన్లకు పోయి అమ్మ చెప్పిన సామాను తీసుకొని డబ్బులు ఇచ్చి వస్తుంటే
,..
"బాబు",..అని తేలు కొట్టినట్టు అరిచిండు దుకానుదారు...
ఏమైందా
అని వెనక్కి తిరిగి చూస్తే " నోటు పోతలేదు బాబు,ఇది చెల్లదు" అని నా 5 రూపాయల నోటుని నా చేతిలో కట్నం పెట్టినట్టు పెట్టిండు.

"ఎందుకు పోదు,ఇది మొన్న మీరే ఇచ్చినట్టు ఉన్నారు" అని నేను అన్నాకూడా "లేదు బాబు,ఇది ఇప్పుడు ఎవరూ తిసుకుంటలేరు"అని ఇంకా ఏదో అంటుండగానే వేరే చిల్లర తీసి ఇచ్చేసాను.


అట్లా నోటుని ఖర్చు పెడదాం అని ఎంత ప్రయత్నించినా అది మాత్రం నన్ను విడువలేదు.ఎంత మందికి నోటు ఇచ్చినా నన్ను zoo లో జంతువు ని చూసినట్టు చూసి,"ఇది చెల్లదు" అని నా కళ్ళు తెరిపించినట్టు ఫీల్ అయిపోయేవారు . నోటు ఎంత చెల్లదు అని వెనక్కి ఇచ్చేసేవారో,అంతే నోటుని ఎట్లైన,ఎవరికైనా అంటగట్టేయాలని కసి పెరిగిపాయింది.

ఒకరోజు
నేను,నా దోస్తు చెఱకు రసం తాగము. బండి వాడికి 5 రూపాయల నోటు తీసి ఇస్తుంటే ,అతను కూడా తీసుకోబోతుండగా నా స్నేహితుడు..."దానవీరశూర కర్ణ" లో అన్నగారి level లో "హితుడా ఆగాగు" అనే రీతిలో "ఒరేయ్, నోటు పోదుర,తెల్వదా" అని వాడి నోటి పైత్యాన్ని చాటుకున్నాడు.ఇగ అది విన్న బండి వాడు దాన్ని ఎంత అందంగా తీసుకోబోయాడో అంతే అందంగా వద్దు అన్నాడు.


అట్లా
కొన్ని రోజులు గడిచిన తరువాత మన తత్వానికి మనుషుల మీద నే కాదు,నోటు మీద కూడా కసి,పగ పనికిరావని,......దమ్ము.దగ్గు లాంటివి సరిపడవని అర్థం అయిపోయి, నోటుని దేవుని హుండీ లో వేసేద్దాం అనుకున్నాను.

దేవుడి
హుండికే నోటు అని ఖాయం చేసుకొని సాయి బాబా గుడికి వెళ్లి ప్రదక్షణాలు చేసి,హారతి పాట అయ్యాక,..తీర్థం,ప్రసాదం తీసుకొని,..హుండీ లో నోటు ని వేయబోతుండగా ఎందుకో బాబా విగ్రహం దిక్కు చూసిన,..........
"నాకు చెల్లని నోటు ఇస్తావా?" అని బాబా నన్ను దీనంగా అడుగుతున్నట్టు అనిపించింది.
"వామ్మో
ఇదేం లొల్లి, అని నోటుని తిరిగి జేబులో పెట్టుకొని వేరే చిల్లర హుండీ లో వేసి బాబా కి దండం పెట్టి బయటకి వచ్చేసిన.బయట కూర్చున్న బిచ్చగాళ్ళకు నోటు వేద్దాం అనుకున్నాను,..వాళ్ళు కూడా నన్ను ఒక రకంగా చూపు చూస్తే మన పరువు పోయి,పరిస్తితి కరీంనగర్ పాత బస్సు స్టాండ్ లెక్క అయితదని అంత దైర్యం చేయలేకపోయాను.


ఇగ అక్కడి నుండి నడుస్తుండగా జామ పండ్ల గంప పెట్టుకొని అమ్ముతున్న ముసలమ్మ కనిపించింది.ఆమె దగ్గరకి పోయి,...
"ఒక పండు ఎంత" అని అడిగాను.

"10 రూపాయలు" అంది...
"నేను అడిగింది ఒక్క పండు,గంప కాదు" అన్నాను.

"నీకు 10 రూపాయలకే గంప గావాల్నా బిడ్డా" అని నవ్వి,.."రెండు పండ్లు ఇస్తా ఇగ తీసుకో"అంది.

సరే
అని రెండు పండ్లు తీసుకొని,చిల్లర ఇవ్వబోయి, నోటు గుర్తొచ్చి దానిని ముసలిదానికి ఇచ్చేసిన.
మరి చూపు ఆనలేదో,లేక నోటు చెల్లదు అని తెల్వదో,నన్ను కరుణించిందో అర్థం కాలేదు కానీ,.. నోటుని ఏమి అనకుండా తీసుకుంది.
నాకెందుకో
నా చిరకాల కోరిక తీరినట్టు అనిపించింది ఒక క్షణం.
తరువాత ముసలమ్మని మళ్ళి చూసి పండ్లు తీసుకొని అలాగే నడుస్తున్నాను.
ముసలమ్మకి వయస్సు 70 ఉంటుంది.అంత వయసున్న మనిషిని మోసం చేసాను అనిపించింది.ఇంత తిరిగీ నేనే నోటుని ఖర్చు పెట్టలేకపోయిన,పాపం ముసలమ్మ దాన్ని ఎం చేస్తుంది,ఎట్లా కర్చు పెడుతుంది,.. నోటుని తీసుకున్నందుకు ముసలమ్మ ఇంట్లో వాళ్ళు ఆమెని తిడితే,అన్నం పెట్టకపోతే,.....ఇలా ఆలోచిస్తుంటే ఎందుకో,..."సంసారం-సాగరం","పేదరికం",...అనే సినిమాలు కూడా గుర్తువచ్చాయి.
నోటు ఆమెకి ఇవ్వకుండా ఉండాల్సింది అనే అపరాదనా భావం పెరిగిపోయింది.దీని కన్నా నోటు నా దగ్గర ఉంటేనే నయం అనుకుని మళ్ళీ ముసలమ్మ దగ్గరికి పోయి,.........
"ఇంతకు ముందు నేనిచ్చిన నోటు చెల్లదమ్మ,నీకు తెల్వదా?ఇంకెవరి దగ్గరా తీసుకోకు" అని చెప్పి నోటు ఇవ్వు అని అన్నాను. ముసలమ్మ ఎందుకో
నా వైపు ప్రేమగా చూసి "గిండ్లేముంది కొడుకా,....లచ్చలు,కోట్లే మునుగుతాండ్రు,5 రూపాయల కోసం అంత నడిసినవా మళ్ళ,..ఇట్లయితే యెట్లా బతుకుతావ్ బిడ్డ",..అని నాకు సెలవు ఇప్పించింది.
నాకు ఏదో పెద్ద అపరాదన భావం నుండి బయట పడ్డట్టు అనిపించింది.


ఇగ
నోటు బతుకమ్మ పండుగప్పుడు సద్దుల లెక్క నేను ఇవ్వడం,అవతలి వాళ్ళు మళ్ళీ "అది చెల్లదు" అని నాకు ఇవ్వడం...ఇదంతా చాల మామూలయిపోయింది.
wine షాప్ నుండి pan షాప్ దాకా,.ఎక్కడా నోటు మాత్రం తీసుకోలేదు.కొన్ని రోజులకి దాని సంగతి మరచిపోయాను,నా పర్సులో అది ఒక అలంకారంగా తయారయింది.


ఒకరోజు
స్నేహితులతో కలిసి షాపింగ్ చేసి,అట్లనే మా దోస్తు ఇంటికి పోయి టీవి చూస్తుంటే,....."5 రూపాయల నోటు చెల్లుతుంది,..ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చే జారి చేసిన ప్రకటన" అనే add చూసి,నా 5 రూపాయల నోటు గుర్తొచ్చి,పర్సు తీసి చూస్తే అందులో నోటు లేదు...షాపింగ్ లోనో,బజ్జీల బండి వాడికో,..ఎవరికో ఇచ్చేసి ఉంటాను అని గుర్తుచేసుకొని నాలో నేనే నవ్వుకున్నాను.

అక్కడి నుండి మా ఇంటికి వెళ్లాను.ఆటో దిగి ఒక 10 రూపాయల నోటు ఇవ్వగానే,..దానికి ఉన్న చిరుగు చూసి,..........
"పోదు" అన్నాడు ఆటో వాడు.!!!