Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Wednesday, November 6, 2013

ఆమె డైరీలో ఒక పేజీ

తేదీ : మర్చిపోలేనిది


అతడిని కలిసి తప్పు చేసానా?
ఎందుకీ రోజు ఇంత స్తబ్ధత...ఎందుకీ అలసట?
ఇంత నిస్సారంగా, ఇంత ద్యేయరహితంగా వున్న రోజు నా జీవితం మొత్తంలో ఇదేనేమో.. రేపు గురించిన అలోచన లేదు..నిన్న గురించిన తలపు లేదు...నేడు ఏ జ్ఞాపకాలు లేవు....!!

ప్రేమించానన్నాడు...ఆనందంతో పొంగిపోయాను.. ఇదే డైరీలో అతని గురించి ఎన్నో రాసుకున్నాను..అతనితోనే జీవితాన్ని ఊహించుకున్నాను..అతనితో గడిపిన క్షణాలన్నీ అద్బుతమే..మరి ఇప్పుడు అతని పేరు రాయడానికే ఎక్కడో బాధ..ఎందుకు?
అతడ్ని కలిసి తప్పు చేసానా..?!

అతను ఏం చూసి నన్ను ప్రేమించాడు...అతనికి నేనిచ్చింది ఏముంది నా మనసు తప్ప? నన్ను కంటి పాపలా చూసుకున్నవాడు అకస్మాత్తుగా ఎందుకు నాకు కనిపించకుండా పోయాడు?
 అతను ఎందుకు దూరం అయ్యాడో తెలియక సతమతమైన నిన్న మొన్నటి రోజులే బాగున్నాయి..
అతని గురించిన అలోచనలు...
అతను మళ్ళీ వస్తాడనే ఆశ...
అతని కోసం సిద్ధంగా ఎన్నో ప్రశ్నలు...
ఎందుకిలా దూరం అయ్యావు అని అడగాలనే ఆరాటం...
ఇవన్నీ ఈ రోజు లేవు..
అన్నిటికి సమాధానం చెప్పాడు!
నిజంగా చెప్పాడా?

నేను వాస్తవాన్ని ఒప్పుకోలేకపోతున్నానా?!!
అతడిని ఎమీ అనలేక వచ్చిన స్తబ్ధతా ఇది? అతన్ని అమితంగా ప్రేమించినందుకు కలుగుతున్న వేదనా? అతడు తిరిగి రాడు అనే నిజాన్ని ఒప్పుకోలేని నిస్సహాయతా?
ఎమిటిది?
అతడిని కలిసి తప్పు చేసానా?

కలవకుండా ఎందుకు నా నుండి వెళ్ళిపోయాడో తెలియని అయోమయ స్థితే నాకు ఇష్టమా? అదే నాకు ఆనందాన్నిస్తుందా?
వాస్తవాన్ని జీర్ణించుకోలేని హీన స్థితికి నన్ను దిగజార్చిందా నా ప్రేమ?
ఇది ప్రేమేనా?

అతడు లేని,..అతని గురించిన అలోచన లేని,...అతడు మళ్ళీ ఎప్పటికీ రాడు అనే నిజంతో ప్రారంభం అయ్యే రేపటి రోజుల్లో ఎలా ఉండగలను? అతను ఎలా ఉంటున్నాడు? ఎలా ఉండగలడు?
అతను అన్న మాటలే క్షణక్షణం గుర్తొస్తున్నాయి..
"నన్ను చూస్తున్నావ్ కదా..ఎలా ఉన్నానో..ఈ సమస్యలతో నిన్ను నేను చూసుకోలేను. ఈ సమస్యలకి పరిష్కారం లేదని,ఉండదని నీకూ తెలుసు..నిన్ను అంతగా ప్రేమించింది నీకిలాంటి జీవితాన్ని ఇద్దామని కాదు. నువ్వు అడగాలనుకునే ప్రశ్నలు,నీ అలోచనలు అన్నీ నాకు తెలుసు. నువ్వు ఎంత బాధపడి ఉంటావో, ఇప్పుడు ఎంత బాధతో నన్ను కలవడానికి వచ్చి ఉంటావో కూడా తెలుసు....కానీ, నీకు ఇదే మంచిది. నీకు ప్రేమే కాదు, మంచి జీవితం కూడా కావాలి...అది నేను నీకు ఇవ్వలేను! ఇంతకుమించి ఏమీ చెప్పలేను...వెళ్ళిపో...నీకు గొప్ప జీవితం ఉండాలి...ఇంతకన్నా మాట్లాడినా నిన్ను మరింత బాధపెట్టిన వాడినవుతాను...నన్ను క్షమించు" !!

నేను కనపడగానే నా ప్రశ్నలన్నీ తెలిసిన వాడిలా..ఒక్క చూపుతో నేనెలా ఉన్నానో తెలుసుకోగలిగిన వాడు...అతనుంటేనే నాకు సంతోషం అనే చిన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడా? ఆ సమస్యల్లో నేను భాగం పంచుకోలేను అనుకున్నాడా?
నాకేది మంచిదో తనకెలా తెలుసు?
నా గురించి తనకేం తెలుసు?
తెలియదా?
నా గురించి తనకు తప్ప ఇంకెవరికి తెలుసు!!
అవును..నన్ను అంత అర్థం చేసుకున్న తనకే నా గురించి తెలుసు..
నాకిదే మంచిదా?
ఇదే మంచిదైతే ఎందుకు నాకీ బాధ....ఇది తాత్కాలికమా?
అసలు అతనిది ప్రేమేనా? ప్రేమ కాకపోతే నా గురించి అంత అలోచిస్తాడా!
మోసపోయానా?
నాకు ఏ విధంగా నష్టం చేయనివాడు మోసం చేసాడని అనుకోవడానికి ఆస్కారం ఎక్కడుంది? నా మంచి కోరి నన్ను వదిలేసాడా?
అది ప్రేమేనా!!?!
నిరంతరం నేను సంతోషంగా ఉండాలి అనుకోవటం ప్రేమా? నాకో గొప్ప జీవితం ఉండాలి అనుకొని తన ప్రేమనే త్యాగం చేసే అంతటి ప్రేమా!!!
అంతటి ప్రేమను పొందిన నేను బాధపడాలా? ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప అంటారు...ప్రేమించబడటం ఇంత శిక్షా? 
అతను చేసింది తప్పా? ఒప్పా?
ప్రేమించాను అని చెప్పి తను గొప్ప ప్రేమికుడయ్యాడు...అంత ప్రేమకి పాత్రురాలిని చేసి నన్ను గొప్పదాన్ని చేసాడు!!  
ఇంతేనా.....అతనితోనే ఉండగలిగితే....అంతటి ప్రేమని ఎప్పటికీ ఆస్వాదించగలిగితే?
నాది స్వార్ధమా?
ఇంకా కొంచెం సమయం తీసుకొని అతడిని కలిస్తే బాగుండేదేమో! అతడు వస్తాడు అనే ఆశతోనే వుంటే ఇంకా సంతోశంగా ఉండేదాన్నా?
 అతడు రాడనే నిజం,ఇక నాతో లేడనే వాస్తవం ఇంత కాల్చేస్తుందా?! కొన్ని నిజాలని తెలుసుకోకపొతేనే ప్రశాంతతా? కొన్నిటి మీద ఆశతో వాటికి దూరంగా బ్రతకడమే జీవితమా?
అతడిని కలిసి తప్పు చేసానా?          

                     ***********************************************

ఆమె ఎవరో మనకి తెలియదు,అతని సమస్య ఏమిటో కూడా మనకి తెలియదు. మనం చేయగలిగింది ఒక్కటే..అతనికి ఆమె మీద వున్న ప్రేమ, ఆమెకి అతని మీద వున్న ఇష్టం నిజమైతే వాళ్ళు కలవాలని మనస్పూర్తిగా కోరుకుందాం!!