"ఇది అతనకి ఇస్తావా"? ఆశగా అడిగింది కార్తిక....
తనకి తెలుసు అతనిచ్చే సమాధానం..ఇవ్వను అని,నీకు పిచ్చి పట్టింది అని, మరచిపోతే మంచిదని, అతను నిన్ను ప్రేమించలేదు అని, ఎంత కాలం ఇలా ఉంటావ్ అని...అన్ని సమాధానాలు తెలిసి కూడా అడుగుతుంది..మళ్ళీ మళ్ళీ అడుగుతుంది...చిన్నపటినుండీ స్నేహితుడు కాబట్టి భరిస్తున్నాడు కానీ, ఇంకొకలైతే పిచ్చి దానికి ఎంత చెప్పినా ఉపయోగం లేదు అని వదిలేసేవాళ్ళే..
ఆ ఉత్తరం అతనికి చేరవేయడమే తనకి కావాలి...ఆ పని చేసి పెట్టగలిగేది ఒక్క తన స్నేహితుడే...హేమంత్..అతన్ని తప్ప ఇంకెవరినీ నమ్మదు...నమ్మలేదు..అతను ఆ పని చేయడు, ఎంత అడిగినా చేయడు, తనంటే ఎంత ఇష్టమున్నా ఈ పని మాత్రం చేయడు, తను ఇంకా అతని ముందు అలుసు అయిపోవడం హేమంత్ కి ఇష్టం లేదు.
E-Mail చేసుకో, ఇంకా ఉత్తరాలేంది పిచ్చి దాని లాగా...ఏ కాలంలో ఉన్నావ్ అంటాడు. అతనికేం తెలుసు,......
కొన్ని భావాలని కాగితం మీద అక్షర రూపంలోనే అందంగా చెప్పగలం అని.. !!!
తను ప్రేమిస్తున్నప్పుడు, అతనితో ఆనందంగా ఎన్నో రోజులు గడిపినప్పుడు ఎవరికీ చెప్పలేదు..ఆ ఆనందంలో ఎవరు గుర్తొచ్చారని? హేమంత్ నే మరచిపోయింది, ఎన్నో రొజులు మాట్లడనేలేదు...అసలు తన ప్రేమ గురించి చెప్పింది ఆ ప్రేమ దూరం అయ్యాకనే...అప్పటినుండీ తన గురించి ఆలోచిస్తూ, తను బాగుండాలి అని ఎంత ఆరటపడుతున్నాడు...ఈ స్నేహం లేకపోతే తను ఎమయిపోయేదో..ప్రేమ దూరం అయింది అనుకుంది కాని, ఆ ప్రేమ తనతోనే హేమంత్ రూపంలో తన పక్కనే ఉంది..తన కోసమె ఆరాటపడుతుంది...తన బాధను పంచుకుంటుంది.
అంతటి ప్రేమ దూరం అయినందుకు బాధపడాలా? ఇంతటి గొప్ప స్నేహితుడు ఉన్నందుకు ఆనందపడాలా? అర్థం కాదు కార్తిక కి.. !!
"అసలు ఏం రాసావ్ ఆ ఉత్తరంలో,..నువ్వేం రాసినా అతను అర్థం చేసుకుంటాడు అనుకున్నావా? నువ్వు పడే బాధ అతనికి తెలియదనుకున్నావా? నీ ఉత్తరం చూడగానే తిరిగొచ్చి నిన్ను మళ్ళీ ప్రేమిస్తాడనుకుంటున్నావా?!
నేను అస్సలు ఇవ్వను..నిన్ను ఇంత బాధపెట్టిన వాడిని కలిసి నవ్వుతూ ఉత్తరం ఇచ్చి రావల్నా...ఎట్లా కనిపిస్తున్నా నీకు? నువ్వు ఒక్కసారి వెళ్ళిపోతావు కదా అమెరికాకి...అప్పుడు చెప్తా వాడి సంగతి...",..ఇలా ఏదో అంటూనే ఉంటాడు...
వీడికి ఎలా చెప్పను..ఈ బాధ కన్నా, అతను చూపిన ప్రేమ ఎన్నో రెట్లు ఎక్కువ అని...ఆ ప్రేమ వల్ల పొందిన ఆనందం ఎంతో ఎక్కువ అని..ఆ ప్రేమ అబద్ధం, అతని మాటలన్నీ అబద్ధం కావచ్చు...తను అనుభవించిన ఆనందం, ప్రేమ మాత్రం నిజం...అది తనకు మాత్రమే తెలుసు..!!
తను వెళ్ళిపోతుంది...అతని జ్ఞాపకాలతో ఉండలేక ఇంకో దేశానికే వెళ్ళిపోతుంది,..ఈ లోపల అతనికి తను రాసిన ఉత్తరం ఇవ్వాలి...తన బాధని, ప్రేమని, తన జీవితం లో అతని స్థానాన్ని అతనికి చెప్పాలని అనుకొని,..ఆ భావాలనే రాసింది...కానీ అవి చేరవేసేవాళ్ళే లేరు!!
తన ప్రయాణానికి ఇంకో నెల కూడా లేదు...తన పనులన్నీ జరిగిపోతున్నాయి..హేమంత్ అన్నీ చూసుకుంటున్నాడు..అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు ...ఉత్తరం ఇవ్వమంటేనే కోపంగా చూసి వెళ్ళిపోతాడు.
ఇంక తనే ఇద్దాం అనుకుంది...అతని ఇంటికి వెళ్ళి, అతన్ని మళ్ళీ కలిసి అయినా సరే, తను ఎంత అవమాన పడినా సరే,..అతనికి తను చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలియాలి,ఆ ఉత్తరం అతను చదవాలి...కనీసం అతను చదువుతాడు అన్న త్రుప్తి చాలు తనకి...ఇదంతా జరుగుతుందా?? జరిగితే మాత్రం తనకేమొస్తుంది? ఏదైన మారుతుందా? తనకి మారడం అక్కర్లేదు..తన స్థితి అతనికి తెలిస్తే చాలు.కానీ హేమంత్ చెప్తున్నట్టు తన బాధ అతనికి తెలియదా? తను సాధించేది ఏముంది, ..అతనకి చెప్పని కొన్ని విషయాలని తెలియజేయడం తప్ప!!
ఇలా ఎన్నో అలోచనలు, ఒక స్తబ్దత, ఒక సందిగ్ధత, అయోమయం, ఏం చెయాలో తెలియని నిస్సహాయత,...ఇదే తన మానసిక ప్రపంచం, ఎన్ని రోజుల నుండి ఇలా ఉంటుందో తనకే తెలుసు..ఎన్ని రోజులు ఉండబోతుందో మాత్రం తెలియదు!
అందరిని వదిలి వెళ్ళిపొతున్నందుకు బాధ ఉందో లేదో కూడా తెలియదు తనకి...అసలు ప్రపంచం లో ఇప్పుడు తను అనుభవిస్తున్న క్షోభ కంటే పెద్ద బాధ తనకేముంటుందని?!
తనే కలిసి ఇద్దాం అనుకుంటుంది అని కనిపెట్టాడేమో..."నేనే ఇస్తాను,నువ్వు వెళ్ళేకంటే ముందే అతన్ని కలిసి ఇస్తాను..నీ కోసం ఇస్తాను...నాకు మాత్రం ఇష్టం లేదు" అన్నాడు హేమంత్.
ఇస్తాడు,తను అనుకున్నది జరుగుతుంది, తన అలోచనలన్నీ అతనికి చేరతాయి..ఎదో త్రుప్తి తనని ఆవరించింది. ఆనందం, బాధ ఏది లేదు. ఒక నిట్టూర్పు...అంతే!!
ఇంకో రోజులో తను వెళ్ళిపోతుంది...ఉత్తరం ఇస్తాను అన్న తరువాత ఎప్పుడిస్తావ్ అని ఒకటి రెండు సార్లు అడిగింది, మళ్ళీ అడగనే లేదు..మర్చిపోయిందా? తనకి తెలియకుండా వెళ్ళి కలిసి ఇచ్చేసిందా? అసలు ఆ మాటే ఎత్తడం లేదు..తను వద్దు అన్నాడని ఊరుకుందా? తనకి ఇష్టం లేదు కాబట్టి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మానుకుందా? ఎవేవో అలోచిస్తున్నాడు హేమంత్.
కార్తిక ఆ సంగతే మాట్లడలేదు...కొన్ని గంటల్లో వెళ్ళిపోతుంది...హేమంత్ ఉండబట్టలేక అడిగాడు..."ఎమనుకుంటున్నావ్, ఉత్తరం ఎదో ఇస్తా అన్నావ్, ఇవ్వవా? ఇవ్వను అన్నప్పుడు రోజూ అదే పనిగా అడిగావ్, ఇస్తా అన్నాక ఆ విషయమే మాట్లడ్డం లేదు? నాకు తెలియకుండా అతడిని కలిసి మళ్ళీ అవమానపడ్డావా? ఆ బాధ మనసులో పెట్టుకొని మాత్రం వెళ్ళకు..ఏం జరిగిందో చెప్పి వెళ్ళు..ఇక్కడ ఇంత మంది ఉంటేనే నీ బాధ మరచిపోలేకపోతున్నావు....అక్కడ ఒక్కదానివి ఎలా ఉంటావ్? ఏం జరిగింది నాకు చెప్పు.."అని అంటుండగానే,..
"లేదు..ఏమీ జరగలేదు..అతన్ని మళ్ళీ కలుస్తాను అని ఎలా అనుకున్నావు? నాకు కొత్తగా వచ్చిన బాధ ఎమీ లేదు..నేను రాసిన ఉత్తరం నేనే చదువుకున్నాను....మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను...అంత గొప్ప భావాలు,అలోచనలు,అంత ప్రేమని నా గురించి అసలు పట్టింపు లేని మనిషికి వ్యక్తపరిచి నన్ను,నా ప్రేమని అవమానపరచడం ఎందుకు అనిపించింది!!
అతన్ని నమ్మి, ప్రేమించి, అతనితో గడిపి అవమాన పడింది చాలేమో అనిపించింది...అందుకే ఇవ్వాలని అనిపించలేదు...నువ్వు ఎప్పటినుండో ఇదే చెప్తున్నావు, కానీ,.. నాకు నేను చెప్పాలి అనుకున్నవి అతనికి చెప్పేయ్యాలి అనే ఆరటం ఉండేది...ఇప్పటికీ ఉంది...కానీ, అవి చెఫ్ఫడం వల్ల మా ఇద్దరికీ వచ్చే లాభం, నష్టం ఎమీ లేదు..నేను తన ప్రేమ ని మరచిపోలేదు అని అతనికి తెలియడం తప్ప!!
అతనికి నేను చెప్పాలి అనుకున్నవి ఎప్పటికీ తెలియకపోవచ్చు,..పోని,..నేను తన గురించి అలోచించటం లేదు అనుకుంటేనే అతను ఆనందంగా ఉంటాడు అనిపిస్తుంది..ఎవరో ఒక్కరైన సంతోషంగా ఉండాలి కదా....ఉండనీ.." అంది కార్తిక.
"నా అలోచనలు, నా ప్రేమ, అతని జ్ఞాపకాలు, అతనితో గడిపిన క్షణాలు, అతను చూపించిన ప్రేమ, అతను నా కోసం ఒకప్పుడు పడిన ఆరాటం,...అన్నీ నాతోనే ఉన్నాయి...ఉంటాయి..అలాగే ఈ ఉత్తరం కూడా నాతోనే ఉంటుంది...కొన్ని సున్నితమైన భావాలు, కొన్ని అందమైన అనుభవాలు,కొన్ని బంధాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అలోచనలు, కొన్ని ఊహలు, కొన్ని మాటలు, కొన్ని కోరికలు ఎవరికీ తెలియకపోవడమే అందం..నాతోనే ఉండని,...నాలోనే ఉండని.." అని వెళ్ళిపోయింది.
కార్తికని చూస్తూ నిలుచుండిపోయాడు హేమంత్...
"ఇది అతనికి ఇస్తావా" అని ఆశగా ఒకప్పుడు అడిగే కార్తికే కళ్ళ ముందు కనపడుతుంది అతనికి !!