Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Wednesday, November 11, 2015

సశేషం...

బాగున్నావా? అని ఎంత సులువుగా అడిగావు...నీ పలకరింపు ఎన్ని జ్ఞాపకాలను నిద్రలేపిందో నీకు తెలుసా...
'అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే...' అని ఒక కవి అన్నట్టు...అలసిపోయాను...నీ గురించి అలోచించి..నీకై ఎదురుచూసి..నీ ప్రతీ కదలికని గమనిస్తూ...నీ ప్రతీ ఇష్టాన్నీ ఆరాధిస్తూ...నీ అలోచనలతో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి..నిన్ను నాలో నింపుకొని...నేనే నువ్వై..ఆ నాలోని నిన్నుని దూరం చేసుకోవడానికి కష్టపడి...ఇంకా కష్టపడుతూ...నువ్వు లేకుండా కూడా ఉండగలను అని స్థిమిత పడే సమయంలో...మళ్ళీ నువ్వు...మళ్ళీ నా నువ్వు....'నా నువ్వు' అనవచ్చో లేదో సందేహమే ఇంకా...

                *......................*..........................*...............................*..........................*

కొన్ని భావాలు ఇలా అసంపూర్ణంగా ఉంటేనే అందంగా ఉంటాయని నమ్ముతూ....

Wednesday, December 31, 2014

నీతో ఆ సాయంత్రాలు...

మన ఊహలు చెదిరిపోవచ్చు....మన స్నేహం సమసిపోవచ్చు..
కానీ గుర్తున్నాయా?!!
మనం మార్చలేని ఆ క్షణాలు...
నీ ఏకాంతాన్ని నేను ఏలిన సమయాలు...
నీ వాంఛ...నీ స్పర్ష...నీ మనసు...నీ ఆత్మ....అన్నీ నావై...నాలోన నువ్వు కలిసిపోయిన అందమైన వెన్నెల రాత్రులు...
సజీవమై నిదురిస్తున్నాయి తెలుసా....కాలం అనే వెచ్చని పానుపులో..!!!

Thursday, June 26, 2014

చేరని ఉత్తరం

"ఇది అతనకి ఇస్తావా"? ఆశగా అడిగింది కార్తిక....

తనకి తెలుసు అతనిచ్చే సమాధానం..ఇవ్వను అని,నీకు పిచ్చి పట్టింది అని, మరచిపోతే మంచిదని, అతను నిన్ను ప్రేమించలేదు అని, ఎంత కాలం ఇలా ఉంటావ్ అని...అన్ని సమాధానాలు తెలిసి కూడా అడుగుతుంది..మళ్ళీ మళ్ళీ అడుగుతుంది...చిన్నపటినుండీ స్నేహితుడు కాబట్టి భరిస్తున్నాడు కానీ, ఇంకొకలైతే పిచ్చి దానికి ఎంత చెప్పినా ఉపయోగం లేదు అని వదిలేసేవాళ్ళే..

ఆ ఉత్తరం అతనికి చేరవేయడమే తనకి కావాలి...ఆ పని చేసి పెట్టగలిగేది ఒక్క తన స్నేహితుడే...హేమంత్..అతన్ని తప్ప ఇంకెవరినీ నమ్మదు...నమ్మలేదు..అతను ఆ పని చేయడు, ఎంత అడిగినా చేయడు, తనంటే ఎంత ఇష్టమున్నా ఈ పని మాత్రం చేయడు, తను ఇంకా అతని ముందు అలుసు అయిపోవడం హేమంత్ కి ఇష్టం లేదు.

E-Mail చేసుకో, ఇంకా ఉత్తరాలేంది పిచ్చి దాని లాగా...ఏ కాలంలో ఉన్నావ్ అంటాడు. అతనికేం తెలుసు,......
కొన్ని భావాలని కాగితం మీద అక్షర రూపంలోనే  అందంగా చెప్పగలం అని.. !!!

తను ప్రేమిస్తున్నప్పుడు, అతనితో ఆనందంగా ఎన్నో రోజులు గడిపినప్పుడు ఎవరికీ చెప్పలేదు..ఆ ఆనందంలో ఎవరు గుర్తొచ్చారని? హేమంత్ నే మరచిపోయింది, ఎన్నో రొజులు మాట్లడనేలేదు...అసలు తన ప్రేమ గురించి చెప్పింది ఆ ప్రేమ దూరం అయ్యాకనే...అప్పటినుండీ తన గురించి ఆలోచిస్తూ, తను బాగుండాలి అని ఎంత ఆరటపడుతున్నాడు...ఈ స్నేహం లేకపోతే తను ఎమయిపోయేదో..ప్రేమ దూరం అయింది అనుకుంది కాని, ఆ ప్రేమ తనతోనే హేమంత్ రూపంలో తన పక్కనే ఉంది..తన కోసమె ఆరాటపడుతుంది...తన బాధను పంచుకుంటుంది.

అంతటి ప్రేమ దూరం అయినందుకు బాధపడాలా? ఇంతటి గొప్ప స్నేహితుడు ఉన్నందుకు ఆనందపడాలా? అర్థం కాదు కార్తిక కి.. !!

"అసలు ఏం రాసావ్ ఆ ఉత్తరంలో,..నువ్వేం రాసినా అతను అర్థం చేసుకుంటాడు అనుకున్నావా? నువ్వు పడే బాధ అతనికి తెలియదనుకున్నావా? నీ ఉత్తరం చూడగానే తిరిగొచ్చి నిన్ను మళ్ళీ ప్రేమిస్తాడనుకుంటున్నావా?!
నేను అస్సలు ఇవ్వను..నిన్ను ఇంత బాధపెట్టిన వాడిని కలిసి నవ్వుతూ ఉత్తరం ఇచ్చి రావల్నా...ఎట్లా కనిపిస్తున్నా నీకు? నువ్వు ఒక్కసారి వెళ్ళిపోతావు కదా అమెరికాకి...అప్పుడు చెప్తా వాడి సంగతి...",..ఇలా ఏదో అంటూనే ఉంటాడు...

వీడికి ఎలా చెప్పను..ఈ బాధ కన్నా, అతను చూపిన ప్రేమ ఎన్నో రెట్లు ఎక్కువ అని...ఆ ప్రేమ వల్ల పొందిన ఆనందం ఎంతో ఎక్కువ అని..ఆ ప్రేమ అబద్ధం, అతని మాటలన్నీ అబద్ధం కావచ్చు...తను అనుభవించిన ఆనందం, ప్రేమ మాత్రం నిజం...అది తనకు మాత్రమే తెలుసు..!!

తను వెళ్ళిపోతుంది...అతని జ్ఞాపకాలతో ఉండలేక ఇంకో దేశానికే వెళ్ళిపోతుంది,..ఈ లోపల అతనికి తను రాసిన ఉత్తరం ఇవ్వాలి...తన బాధని, ప్రేమని, తన జీవితం లో అతని స్థానాన్ని అతనికి చెప్పాలని అనుకొని,..ఆ భావాలనే రాసింది...కానీ అవి చేరవేసేవాళ్ళే లేరు!!

తన ప్రయాణానికి ఇంకో నెల కూడా లేదు...తన పనులన్నీ జరిగిపోతున్నాయి..హేమంత్ అన్నీ చూసుకుంటున్నాడు..అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు ...ఉత్తరం ఇవ్వమంటేనే కోపంగా చూసి వెళ్ళిపోతాడు.

ఇంక తనే ఇద్దాం అనుకుంది...అతని ఇంటికి వెళ్ళి, అతన్ని మళ్ళీ కలిసి అయినా సరే, తను ఎంత అవమాన పడినా సరే,..అతనికి తను చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలియాలి,ఆ ఉత్తరం అతను చదవాలి...కనీసం అతను చదువుతాడు అన్న త్రుప్తి చాలు తనకి...ఇదంతా జరుగుతుందా?? జరిగితే మాత్రం తనకేమొస్తుంది? ఏదైన మారుతుందా? తనకి మారడం అక్కర్లేదు..తన స్థితి అతనికి తెలిస్తే చాలు.కానీ హేమంత్ చెప్తున్నట్టు తన బాధ అతనికి తెలియదా? తను సాధించేది ఏముంది, ..అతనకి చెప్పని కొన్ని విషయాలని తెలియజేయడం తప్ప!!

ఇలా ఎన్నో అలోచనలు, ఒక స్తబ్దత, ఒక సందిగ్ధత, అయోమయం, ఏం చెయాలో తెలియని నిస్సహాయత,...ఇదే తన మానసిక ప్రపంచం, ఎన్ని రోజుల నుండి ఇలా ఉంటుందో తనకే తెలుసు..ఎన్ని రోజులు ఉండబోతుందో మాత్రం తెలియదు!
అందరిని వదిలి వెళ్ళిపొతున్నందుకు బాధ ఉందో లేదో కూడా తెలియదు తనకి...అసలు ప్రపంచం లో ఇప్పుడు తను అనుభవిస్తున్న క్షోభ కంటే పెద్ద బాధ తనకేముంటుందని?!

తనే కలిసి ఇద్దాం అనుకుంటుంది అని కనిపెట్టాడేమో..."నేనే ఇస్తాను,నువ్వు వెళ్ళేకంటే ముందే అతన్ని కలిసి ఇస్తాను..నీ కోసం ఇస్తాను...నాకు మాత్రం ఇష్టం లేదు" అన్నాడు హేమంత్.

ఇస్తాడు,తను అనుకున్నది జరుగుతుంది, తన అలోచనలన్నీ అతనికి చేరతాయి..ఎదో త్రుప్తి తనని ఆవరించింది. ఆనందం, బాధ ఏది లేదు. ఒక నిట్టూర్పు...అంతే!!

ఇంకో రోజులో తను వెళ్ళిపోతుంది...ఉత్తరం ఇస్తాను అన్న తరువాత ఎప్పుడిస్తావ్ అని ఒకటి రెండు సార్లు అడిగింది, మళ్ళీ అడగనే లేదు..మర్చిపోయిందా? తనకి తెలియకుండా వెళ్ళి కలిసి ఇచ్చేసిందా? అసలు ఆ మాటే ఎత్తడం లేదు..తను వద్దు అన్నాడని ఊరుకుందా? తనకి ఇష్టం లేదు కాబట్టి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మానుకుందా? ఎవేవో అలోచిస్తున్నాడు హేమంత్.

కార్తిక ఆ సంగతే మాట్లడలేదు...కొన్ని గంటల్లో వెళ్ళిపోతుంది...హేమంత్ ఉండబట్టలేక అడిగాడు..."ఎమనుకుంటున్నావ్, ఉత్తరం ఎదో ఇస్తా అన్నావ్, ఇవ్వవా? ఇవ్వను అన్నప్పుడు రోజూ అదే పనిగా అడిగావ్, ఇస్తా అన్నాక ఆ విషయమే మాట్లడ్డం లేదు?  నాకు తెలియకుండా అతడిని కలిసి మళ్ళీ అవమానపడ్డావా?  ఆ బాధ మనసులో పెట్టుకొని మాత్రం వెళ్ళకు..ఏం జరిగిందో చెప్పి వెళ్ళు..ఇక్కడ ఇంత మంది ఉంటేనే నీ బాధ మరచిపోలేకపోతున్నావు....అక్కడ ఒక్కదానివి ఎలా ఉంటావ్? ఏం జరిగింది నాకు చెప్పు.."అని అంటుండగానే,..

"లేదు..ఏమీ జరగలేదు..అతన్ని మళ్ళీ కలుస్తాను అని ఎలా అనుకున్నావు?  నాకు కొత్తగా  వచ్చిన బాధ ఎమీ లేదు..నేను రాసిన ఉత్తరం నేనే చదువుకున్నాను....మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను...అంత గొప్ప భావాలు,అలోచనలు,అంత ప్రేమని నా గురించి అసలు పట్టింపు లేని మనిషికి వ్యక్తపరిచి నన్ను,నా ప్రేమని అవమానపరచడం ఎందుకు అనిపించింది!!
అతన్ని నమ్మి, ప్రేమించి, అతనితో గడిపి అవమాన పడింది చాలేమో అనిపించింది...అందుకే ఇవ్వాలని అనిపించలేదు...నువ్వు ఎప్పటినుండో ఇదే చెప్తున్నావు, కానీ,.. నాకు నేను చెప్పాలి అనుకున్నవి అతనికి చెప్పేయ్యాలి అనే ఆరటం ఉండేది...ఇప్పటికీ ఉంది...కానీ, అవి చెఫ్ఫడం వల్ల మా ఇద్దరికీ వచ్చే లాభం, నష్టం ఎమీ లేదు..నేను తన ప్రేమ ని మరచిపోలేదు అని అతనికి తెలియడం తప్ప!!
అతనికి నేను చెప్పాలి అనుకున్నవి ఎప్పటికీ తెలియకపోవచ్చు,..పోని,..నేను తన గురించి అలోచించటం లేదు అనుకుంటేనే అతను ఆనందంగా ఉంటాడు అనిపిస్తుంది..ఎవరో ఒక్కరైన సంతోషంగా ఉండాలి కదా....ఉండనీ.." అంది కార్తిక.

"నా అలోచనలు, నా ప్రేమ, అతని జ్ఞాపకాలు, అతనితో గడిపిన క్షణాలు, అతను చూపించిన ప్రేమ, అతను నా కోసం ఒకప్పుడు పడిన ఆరాటం,...అన్నీ నాతోనే ఉన్నాయి...ఉంటాయి..అలాగే ఈ ఉత్తరం కూడా నాతోనే ఉంటుంది...కొన్ని సున్నితమైన భావాలు, కొన్ని అందమైన అనుభవాలు,కొన్ని బంధాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అలోచనలు, కొన్ని ఊహలు, కొన్ని మాటలు, కొన్ని కోరికలు ఎవరికీ తెలియకపోవడమే అందం..నాతోనే ఉండని,...నాలోనే ఉండని.." అని వెళ్ళిపోయింది.
      
 కార్తికని చూస్తూ నిలుచుండిపోయాడు హేమంత్...

"ఇది అతనికి ఇస్తావా" అని ఆశగా ఒకప్పుడు అడిగే కార్తికే కళ్ళ ముందు కనపడుతుంది అతనికి !!


Wednesday, November 6, 2013

ఆమె డైరీలో ఒక పేజీ

తేదీ : మర్చిపోలేనిది


అతడిని కలిసి తప్పు చేసానా?
ఎందుకీ రోజు ఇంత స్తబ్ధత...ఎందుకీ అలసట?
ఇంత నిస్సారంగా, ఇంత ద్యేయరహితంగా వున్న రోజు నా జీవితం మొత్తంలో ఇదేనేమో.. రేపు గురించిన అలోచన లేదు..నిన్న గురించిన తలపు లేదు...నేడు ఏ జ్ఞాపకాలు లేవు....!!

ప్రేమించానన్నాడు...ఆనందంతో పొంగిపోయాను.. ఇదే డైరీలో అతని గురించి ఎన్నో రాసుకున్నాను..అతనితోనే జీవితాన్ని ఊహించుకున్నాను..అతనితో గడిపిన క్షణాలన్నీ అద్బుతమే..మరి ఇప్పుడు అతని పేరు రాయడానికే ఎక్కడో బాధ..ఎందుకు?
అతడ్ని కలిసి తప్పు చేసానా..?!

అతను ఏం చూసి నన్ను ప్రేమించాడు...అతనికి నేనిచ్చింది ఏముంది నా మనసు తప్ప? నన్ను కంటి పాపలా చూసుకున్నవాడు అకస్మాత్తుగా ఎందుకు నాకు కనిపించకుండా పోయాడు?
 అతను ఎందుకు దూరం అయ్యాడో తెలియక సతమతమైన నిన్న మొన్నటి రోజులే బాగున్నాయి..
అతని గురించిన అలోచనలు...
అతను మళ్ళీ వస్తాడనే ఆశ...
అతని కోసం సిద్ధంగా ఎన్నో ప్రశ్నలు...
ఎందుకిలా దూరం అయ్యావు అని అడగాలనే ఆరాటం...
ఇవన్నీ ఈ రోజు లేవు..
అన్నిటికి సమాధానం చెప్పాడు!
నిజంగా చెప్పాడా?

నేను వాస్తవాన్ని ఒప్పుకోలేకపోతున్నానా?!!
అతడిని ఎమీ అనలేక వచ్చిన స్తబ్ధతా ఇది? అతన్ని అమితంగా ప్రేమించినందుకు కలుగుతున్న వేదనా? అతడు తిరిగి రాడు అనే నిజాన్ని ఒప్పుకోలేని నిస్సహాయతా?
ఎమిటిది?
అతడిని కలిసి తప్పు చేసానా?

కలవకుండా ఎందుకు నా నుండి వెళ్ళిపోయాడో తెలియని అయోమయ స్థితే నాకు ఇష్టమా? అదే నాకు ఆనందాన్నిస్తుందా?
వాస్తవాన్ని జీర్ణించుకోలేని హీన స్థితికి నన్ను దిగజార్చిందా నా ప్రేమ?
ఇది ప్రేమేనా?

అతడు లేని,..అతని గురించిన అలోచన లేని,...అతడు మళ్ళీ ఎప్పటికీ రాడు అనే నిజంతో ప్రారంభం అయ్యే రేపటి రోజుల్లో ఎలా ఉండగలను? అతను ఎలా ఉంటున్నాడు? ఎలా ఉండగలడు?
అతను అన్న మాటలే క్షణక్షణం గుర్తొస్తున్నాయి..
"నన్ను చూస్తున్నావ్ కదా..ఎలా ఉన్నానో..ఈ సమస్యలతో నిన్ను నేను చూసుకోలేను. ఈ సమస్యలకి పరిష్కారం లేదని,ఉండదని నీకూ తెలుసు..నిన్ను అంతగా ప్రేమించింది నీకిలాంటి జీవితాన్ని ఇద్దామని కాదు. నువ్వు అడగాలనుకునే ప్రశ్నలు,నీ అలోచనలు అన్నీ నాకు తెలుసు. నువ్వు ఎంత బాధపడి ఉంటావో, ఇప్పుడు ఎంత బాధతో నన్ను కలవడానికి వచ్చి ఉంటావో కూడా తెలుసు....కానీ, నీకు ఇదే మంచిది. నీకు ప్రేమే కాదు, మంచి జీవితం కూడా కావాలి...అది నేను నీకు ఇవ్వలేను! ఇంతకుమించి ఏమీ చెప్పలేను...వెళ్ళిపో...నీకు గొప్ప జీవితం ఉండాలి...ఇంతకన్నా మాట్లాడినా నిన్ను మరింత బాధపెట్టిన వాడినవుతాను...నన్ను క్షమించు" !!

నేను కనపడగానే నా ప్రశ్నలన్నీ తెలిసిన వాడిలా..ఒక్క చూపుతో నేనెలా ఉన్నానో తెలుసుకోగలిగిన వాడు...అతనుంటేనే నాకు సంతోషం అనే చిన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడా? ఆ సమస్యల్లో నేను భాగం పంచుకోలేను అనుకున్నాడా?
నాకేది మంచిదో తనకెలా తెలుసు?
నా గురించి తనకేం తెలుసు?
తెలియదా?
నా గురించి తనకు తప్ప ఇంకెవరికి తెలుసు!!
అవును..నన్ను అంత అర్థం చేసుకున్న తనకే నా గురించి తెలుసు..
నాకిదే మంచిదా?
ఇదే మంచిదైతే ఎందుకు నాకీ బాధ....ఇది తాత్కాలికమా?
అసలు అతనిది ప్రేమేనా? ప్రేమ కాకపోతే నా గురించి అంత అలోచిస్తాడా!
మోసపోయానా?
నాకు ఏ విధంగా నష్టం చేయనివాడు మోసం చేసాడని అనుకోవడానికి ఆస్కారం ఎక్కడుంది? నా మంచి కోరి నన్ను వదిలేసాడా?
అది ప్రేమేనా!!?!
నిరంతరం నేను సంతోషంగా ఉండాలి అనుకోవటం ప్రేమా? నాకో గొప్ప జీవితం ఉండాలి అనుకొని తన ప్రేమనే త్యాగం చేసే అంతటి ప్రేమా!!!
అంతటి ప్రేమను పొందిన నేను బాధపడాలా? ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప అంటారు...ప్రేమించబడటం ఇంత శిక్షా? 
అతను చేసింది తప్పా? ఒప్పా?
ప్రేమించాను అని చెప్పి తను గొప్ప ప్రేమికుడయ్యాడు...అంత ప్రేమకి పాత్రురాలిని చేసి నన్ను గొప్పదాన్ని చేసాడు!!  
ఇంతేనా.....అతనితోనే ఉండగలిగితే....అంతటి ప్రేమని ఎప్పటికీ ఆస్వాదించగలిగితే?
నాది స్వార్ధమా?
ఇంకా కొంచెం సమయం తీసుకొని అతడిని కలిస్తే బాగుండేదేమో! అతడు వస్తాడు అనే ఆశతోనే వుంటే ఇంకా సంతోశంగా ఉండేదాన్నా?
 అతడు రాడనే నిజం,ఇక నాతో లేడనే వాస్తవం ఇంత కాల్చేస్తుందా?! కొన్ని నిజాలని తెలుసుకోకపొతేనే ప్రశాంతతా? కొన్నిటి మీద ఆశతో వాటికి దూరంగా బ్రతకడమే జీవితమా?
అతడిని కలిసి తప్పు చేసానా?          

                     ***********************************************

ఆమె ఎవరో మనకి తెలియదు,అతని సమస్య ఏమిటో కూడా మనకి తెలియదు. మనం చేయగలిగింది ఒక్కటే..అతనికి ఆమె మీద వున్న ప్రేమ, ఆమెకి అతని మీద వున్న ఇష్టం నిజమైతే వాళ్ళు కలవాలని మనస్పూర్తిగా కోరుకుందాం!!

Friday, October 12, 2012

ఓ జ్ఞాపకం

నేను దాదాపు పది సంవత్సరాలు ప్రతి గురువారం సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్ళిన.ముందు బాబా హారతి పాట నచ్చి,తరువాత ఆ హారతి పాట నేర్చుకునేటందుకు,నేర్చుకున్నాక పాడేటందుకు,ఆ తరువాత బాబా మీద భక్తితో,నమ్మకంతో అట్లా వెళ్తూనే ఉన్నాను.
 మేము ఉండే కాలనీకి కొంచెం దూరంలో గుడి ఉండేది.నడవడానికి అరగంట పట్టేది.రెండస్థుల భవంతిలో చూడటానికి గమ్మత్తుగా ఉండేది.ఆ ఏరియాలో అదొక్కటే బాబా గుడి అవడంతో ఎంతో మంది వచ్చేటోళ్ళు,అన్ని సంవత్సరాలు వెళ్ళడం వలన నాతో పాటుగా క్రమం తప్పకుండా గుడికి వచ్చే వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టేవారు,కొందరు పలకరించేవాళ్ళు. 

 ఒకరోజు ఎప్పటిలాగే గుడికి పోయి,హారతి ప్రారంభం కాంగనే నేను కూడా పాడటం ప్రారంభించిన,మధ్యలో కరెంటు పోవడం వల్ల టేప్ లో వచ్చే హారతి పాట ఆగిపోయింది.అది ఆగిపోయినా హారతి పాట వచ్చిన నాలాంటి వాళ్ళం ఆగకుండా పాడుతూనే వున్నాం.అందులో నేను కాస్త శ్రుతి పెంచి గట్టిగా పాడుతున్నాను.హారతి అయిపొయింది.కరెంటు కూడా వచ్చింది.ఎందుకో తల తిప్పి చూసిన నాకు,నన్ను చూసి అభినందిస్తున్నట్టుగా తను నవ్వినట్టు అనిపించింది.పాట కర్ణకఠోరంగా పాడినందుకేమో అని ఎవరో తెల్వకపోయినా తన నవ్వుకి నా నవ్వుతో నేను బదులిచ్చాను.
                           ఆనాటి నుండి ప్రతి గురువారం మేము ఒకరిని ఒకరం చూసుకుంటే నవ్వుతోనే పలకరించుకునేటోళ్ళం.తను ఒకోసారి వచ్చేది కాదు,ఒకోసారి తన స్నెహితురాలితో వచ్చేది.చాలసార్లు గుడికి వెళ్ళే దారిలో నా ముందే నడిచేది,లేక నా వెనకే వచ్చేది.రోడ్డుకి అటువైపు తను,ఇటువైపు నేను నడిచిన రోజులు కూడా చాలానే ఉన్నాయి.కాని ఎప్పుడూ నేనామెని మాట్లడించలేదు.తను కూడా నన్నెప్పుడూ మట్లాడించలేదు.అంత అవసరం మాకు రాలేదు కూడా.కనిపించిన ప్రతీసారి చిన్న చిరునవ్వులతోనే దాదాపు నాలుగేళ్ళు గడిచిపోయింది.
మౌనం కన్నా గొప్ప సంభాషన ఏముంటుంది?

మా పరిచయం ఒక్క నవ్వుతోనె మొదలయింది,మా కుశల ప్రశ్నలు,మా సంభాషణ,మా స్నేహం,మా బంధం అంతా ఆ ఒక్క నవ్వులోనే ఉండెవి.అక్కడితోనె ఆగిపొయేవి.

 తనెప్పుడూ బాబాకి కోవా తెచ్చేది.హారతి తరవాత అందరికీ పంచి పెట్టేది.నేనెక్కడున్నా నా దగ్గరికి వచ్చి చిన్నగా నవ్వి నా చెతిలో కోవా పెట్టి వెళ్ళేది.
       
 కొన్ని రోజులకి మేము అక్కడి నుండి ఇల్లు మారటం వల్ల ఆ గుడికి వెళ్ళటం పూర్తిగా ఆపేశాను .
ఒక ఆరు నెలల తరువాత గురువారం సాయంత్రం ఆ గుడికి వెళ్ళడం జరిగింది.
హారతి అంతా అయిపోయాక,నన్ను చూసి నిండుగా నవ్వె నవ్వు కోసం,తను ఇచ్చే కోవా కొసం వెతికాను.తను రాలెదు,కనిపించలేదు.
ఆ బాబా గుడి తలుచుకున్నప్పుడల్లా తను గుర్తొస్తూనే ఉండేది.

 మరొక రెండు సంవత్సరాల తరువాత అనుకోకుండా గురువారం రోజు అదే గుడికి వెళ్ళాను నా స్నెహితులతో,....చిన్నప్పటి నుండి వచ్చిన స్థలం,నడచిన దారి...అన్నీ ఎంతో ఆహ్లాదం కలిగించాయి.గుడి లోపలికి వెళ్ళి హారతి ప్రారంభిస్తారనగా నిలబడి ఉన్న నాకు తన స్నెహితురాలు కనిపించింది.
ఎంతో ఆనందంతో ధైర్యం చేసి తన దగ్గరికి వెళ్ళి..."మీతో పాటు మీ ఫ్రెండ్ వచ్చేది కదా ఎప్పుడూ..తనెలా ఉంది?బాగుందా?" అని అడిగిన.
తను నన్ను గుర్తుపట్టిందో ఏమో  తెల్వదు కానీ...తను చెప్పిన సమాధానంతో నేను ఎంతో బాధపడ్డాను.ఆ నిమిషంలో మనకి ఏమీ కాని వారి కోసం కూడా మనం ఇంత బాధపడతామా అనిపించింది.

ఇంతలో హారతి ప్రారంభించారు.
 కానీ,నా మనసులో ఒక్కసారిగా తన గురించిన అలోచనలు నిండిపోయాయి.
నాకు తన పేరు తెలియదు.తను ఎక్కడుంటుందో తెలియదు,తన స్వభావం తెలియదు,తన వాళ్ళెవరో తెలియదు,తన స్వరం ఎలా ఉంటుందో కూడా తెలియదు,తన నవ్వు తప్ప ఆ నవ్వు వెనకాల తనకున్న బాధలూ తెలియవు,తన చదువు,తన ఇష్టాలు,తన అయిష్టాలు ఏవీ తెలియవు.
             తన గురించి ఇవేమీ తెలియని నాకు....ఆమె శాశ్వతంగా నిద్రపోయింది అని తన గురించి తెలిసిన ఒకే ఒక్క నిజం మాత్రం నన్ను ఎంత గానో బాదపెట్టింది.
ఆ క్షణం నా మనసులో తను నన్ను చూసి మనస్పూర్తిగా నవ్వే నవ్వు గుర్తుకు వచ్చింది.
తనెవరో తెలియకపోయినా,ఈ లోకంలో తను లేకపోయినా..తన నవ్వు మాత్రం నా జ్ఞాపకాలలో ఇప్పటికీ సజీవంగానే ఉంది!!!