Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Monday, January 30, 2012

చిన్ననాటి నా తొలి రచన

నేను 6 తరగతి లో ఉండగా రాసిన మొట్ట మొదటి పాట ఇది..చేసిన తొలి రచన ఇది...మరి పాత సినిమాల ప్రభావమో,లేక అప్పట్లో వచ్చిన 'అన్నమయ్య' సినిమా ప్రభావమో తెలవదు కాని...మొత్తానికి నా ఇష్టదైవం మీద నాలుగు వరుసలు రాసి..ఏదో సాదించినట్టు అందరికీ ఈ పాట చూపించడం,నేనే ట్యూన్ చేసి,పాడి మరీ అందరికీ వినిపించడం( హింసించడం) నాకు ఇంకా గుర్తు.......
 ఇక మీరూ చదవండి...

 "వేంకటేశ్వరుని మహత్తు..
చూస్తేనే తెలియునా గమ్మత్తు...

శ్రీనివాసునికెందరో భక్తులున్నా...
కొందరితో చేస్తాడీ గమ్మత్తు..

ఎందరికో పెడతాడు పరీక్షలు..
అవి ఎన్నటికీ కావు మనకు శిక్షలు..

ఒక్కసారి మొక్కితే పోతుందా గీత,.బ్రహ్మ రాత..
పూర్వ జన్మలో ఉండొద్దు...పాపాల ఖాతా.."

Wednesday, January 4, 2012

మేనత్త-మెగాసీరియల్

"కలికి చిలకల కొలికి మాకు మేనత్త..కలవారి కోడలు కనకమాలక్ష్మి.." అని నేను హాయిగా పాడుకోవచ్చు..ఎందుకంటే అట్లాంటి మాలక్ష్మిలు నాకు ముగ్గురు ఉన్నారు.మరి నేను ఒక్కడ్నే మేనల్లుడిని కదా...నన్ను గార్వం కూడా ఎక్కువగానే చేసెటోల్లు,ఇప్పటికీ చేస్తారు కూడా..అందులో మా మూడో మేనత్త అయితే నాతో ఆటలు ఆడటం,టీవీలో పాత శోభన్ బాబు సినిమాలు చూపించడం,జోక్స్ చెప్పడం అన్ని చేసేటోళ్ళు....పచ్చీస్ నుండి చైనీస్ చెక్కర్ దాకా,ఓనగుంటలు నుండి రమ్మి దాకా,..మా అత్తమ్మ దగ్గరికి వెళ్తే అన్నీ ఆడేటోళ్ళం..మాకు(నాకు,మా అక్కయ్యకీ...) రాని ఆటలు అన్నీ నేర్పించేటోళ్ళు.

రాను రాను,..టీవి చానల్లు ఎక్కువ అవడం,ధారావాహికలు పెరిగిపోవడం లాంటి కారణాల వల్ల మేము అందరం కలిసినా..,టీవి చూడటం లోనే మునిగిపోయేటోళ్ళం.ఇన్ని రోజులు ఆటలు,పాటలు నేర్పించిన మా అమ్మ,అత్తమ్మలు మమ్మల్ని కూర్చోబెట్టుకొని మరీ సీరియల్స్ చూసుడు మొదలుపెట్టిండ్రు...
ఆ విధంగా మేము చూసిన కళాఖండాలలో రుతురాగాలు,అంతరంగాలు,విధి,కళంకిత,ఇది కథ కాదు లాంటి కలలో కూడా మర్చిపోలేని సీరియల్స్ ఉన్నాయి(ఈ-టీవి సుమన్ బాబుని,రాడాన్ రాధిక ని బీభత్సంగా ప్రోత్సహించింది మేమే మరి)!!
ఈ సీరియల్లు ఎంతగా అలవాటు అయ్యాయంటే అసలు మాటలు కూడా తక్కువ మాట్లాడే మా బావ,.ఒకసారి అకస్మాత్తుగా.."ఎంత గొప్పది బ్రతుకు మీద ఆశ.."అని అంతరంగాలు సీరియల్ లోని పాట పాడుకుంటూ మాకు దొరికిపోయేంతగా..!!

ఈ మొదటి దఫా సీరియల్స్ జీడి పాకం లెక్క సాగీ,సాగీ అయిపోంగనే..ఇగ జీవితంలో సీరియల్స్ చూడవద్దని నేను నిర్ణయించుకున్నాను..కాని,మా అత్తమ్మ,అమ్మ వదలకుండా తరువాత వచ్చిన ప్రతీ కళాఖండాన్ని చూసి చానెళ్ళ టీ ఆర్ పీ రేటింగ్స్ పెంచడంలో కొంత సహాయపడ్డారు!! 
సీరియల్ టైటిల్ సాంగ్ దగ్గరనుండి "రేపటి ఎపిసోడ్"లో అని వచ్చే చిన్న చిన్న సీన్లు చూసేదాకా టీవీ మీద నుండి కనురెప్ప తీసేటోళ్ళు కాదు.ఆ సమయంలో దేశ ప్రధాని వచ్చి ఇంటి బయట ఉన్నారు అన్నా కూడా వినిపించుకునేటోళ్ళు కాదు.పొరపాటున ఎప్పుడైనా సీరియల్ టైంలో కరెంటు పోయిందో..కరెంటోడి దగ్గరినుండి ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరిని కలిపి ఎన్ని తిట్లు తిట్టేటోళ్ళో...అంత ఆసక్తి తో,భక్తి తో ప్రతీ సీరియల్ ని ఉద్ధరించారు.

ఇట్లా కొన్ని సీరియల్లు(అదే కొన్ని సంవత్సరాలు) గడిచాయి."అంతరంగాలు" సీరియల్ అప్పుడు డిగ్రీ లో చేరిన మా బావకి "చక్రవాకం" సీరియల్ అయ్యేసరికి జాబ్ వచ్చి,పెళ్లి కుదిరింది.మా అత్తమ్మ ఆనందానికి అంతులేదు.పెళ్లి తిరుపతి లో బాగా జరిగింది.పెళ్లి అయ్యాక మా బావ అమెరికా
వెళ్లిపోయిండ్రు.

 ఈ తంతు అంతా అయినంక ఒకరోజు మా అత్తమ్మ దగ్గరకు పోయాను.
నేను వెళ్లేసరికి....
"వాళ్ళిద్దరూ కలిస్తే బాగుండు...ఆ ఎర్ర చీర దానికి బుద్ధి వచ్చిందో.,లేదో..ఆ పనికిమాలినోడు జైలుకి పోయిండో లేదో...."అంటూ పనిమనిషితో దీర్ఘంగా చర్చిస్తున్నారు...
"ఏంది అత్తమ్మ..అంత సీరియెస్ గా మాట్లాడుకుంటుండ్రు" అని నేను అంటే...
"ఏం లేదురా...9.30కి వచ్చే సీరియల్(క్షమించాలి,ఆ కళాఖండం పేరు మర్చిపోయాను)నాలుగేళ్ల నుండి వస్తుంది...అసలు అయిపోయే ముచ్చటనే లేకుండె...బావ పెళ్లి పనులు ఉన్నా కూడా..రోజూ చూసిన..అట్లాంటిది మనం తిరుపతి పోయి వచ్చే సరికి ఆ వారం రోజుల్లోనే ఆ సీరియల్ అయిపోయి..కొత్తది మొదలయింది..అది అసలు అంత తొందరగా ఎట్లా ముగించిండో మనస్న పడ్తలేదు..."అన్నారు మా అత్తమ్మ..


నిజమే..సినిమా అంతా చూసాక క్లైమాక్స్ ముందు కరెంటు పోయినట్టు..నాలుగేండ్ల నుండి విడువకుండా కష్టపడి చూస్తున్న సీరియల్ అర్ధాంతరంగా,అసలు ముగింపు ఏమైందో తెల్వకపోతే ఎట్లుంటదో నాకు తెల్సు..(ఒకనాటి సీరియల్ బాధితుడ్ని కదా మరి!!) 


 ఆ సీరియల్ ముగింపు గురించి మా అత్తమ్మ ఎంత మందిని ఆరా తీసినా,..ఫలితం లేకపోయింది.మొత్తానికి కొన్ని రోజులు ప్రయత్నించి...వేరే సీరియల్స్ చూడటంలో మునిగిపోయిండ్రు..

రెండేళ్ళ తరువాత...

ఒకరోజు అత్తమ్మ మా ఇంటికి వచ్చిండ్రు..భాతాఖాని మాట్లాడుకుంటూ..మా బావ పెళ్లి విశేషాలు,ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటున్నాం..
అప్పుడే నేను "ముగింపు మిస్ అయిన సీరియల్" గురించి కావాలనే గుర్తుచేసాను మా వాళ్ళకి.... అంతే..మా అమ్మ,మా అత్తమ్మ..మళ్లీ ఆ ఎర్ర చీర గురించీ,ఆ సీరియల్ హీరో మూడో భార్య రెండో జన్మ గురించీ,అందులో విలన్ గురించీ,..ఇట్లా సదరు ఆ సీరియల్ డైరెక్ట్ చేసిన వాడికి కూడా గుర్తులేని విషయాలు మాట్లాడుకుంటూ,ఆ విషయాలు గుర్తుచేసుకుంటూ..ఆ సీరియల్ ముగింపు ఈ విధంగా ఉండి ఉండవచ్చు,.అని వాళ్లకు నచ్చని పాత్రలను చంపి,.నచ్చిన వారిని ఉంచి...మన హీరో రాజశేఖర్,జీవితలు ప్రెస్ మీట్ పెట్టి పనిగట్టుకొని చిరంజీవిని తిట్టినట్టు...ఆ సీరియల్ వాళ్ళని కొంచం సేపు తిట్టుకొని సంతృప్తి పడ్డారు..

"ఎంత తిట్టినా..దాని
క్లైమాక్స్ మీకు ఎట్లైన తెలవదు కదా" అని నేను అనగానే...

"ఔన్రా...అసలది ఏమైందో...ఎట్లా ముగించిండో...అందుకే ఈ సీరియల్స్ పాడుగాను..చుడనేవద్దు...ఒకరోజు చూడకపోయినా ఏం మనసునపట్టది..దరిద్రపు సీరియల్లు..."అని తిట్టుకుంటూనే....జెమినిలో కొత్త సీరియల్ "మహాలక్ష్మి నివాసం" వచ్చే టైం అయింది...టీవీ పెట్టు" అన్నారు మా మేనత్త..!!