Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Friday, September 8, 2017

బందర్ to అమెరిక

"ఏమే...తినకండే.."
"అసలు మనసాక్షి ఉందానే మీకు...నాకు కొంచం అయినా మిగిల్చండి...ఎలా తినగలుగుతున్నారసలు...?"
గురువారం రాత్రి సమయంలో వాళ్ళ ఇంటి తలుపు దగ్గర నిలబడి స్నేహితురాలితో మట్లాడుతున్న నాకు ఈ మాటలు వినిపించాయి..మనిషి కనపడలేదు కానీ ఆ అమ్మాయికి పాపం తినడానికి ఏం లేదేమో అనుకున్నాను..అసలు విషయం కనుక్కుంటే నవ్వాగలేదు..ఆ అమ్మాయి గురువారం non-veg తినదు..కానీ తనకి chicken అంటే ప్రాణం, రోజూ తింటుంది..ఒక్క గురువారం, శనివారం తప్ప...ఆ రెండు రోజులూ 12 గం. తరువాత తింటుంది కోడి కి అన్యాయం చేయకుండ..

"నాకు chicken తినకపోతే తిన్నట్టే ఉండదు తాతా..ఆ గురువారం, శనివారం ఎలాగో దేవుడి పేరు చెప్పి కళ్ళు మూసుకుంటా.." అంది మా పరిచయం స్నేహంగా మారాక...తనకన్నా 5 సంవత్సరాలు పెద్ద అయిన నేరానికి నన్ను ఆప్యాయంగా తాతా అంటుంది..నేను ఆనందంగా మర్చిపోయి జీవిస్తున్న నా వయస్సు పెరుగుతుంది అని గుర్తుచేస్తూ..

"బందరులో మా అమ్మ చేసే కొడి కూరంటేనే ఇష్టం" అనేది...నాకెప్పుడు తను బందరు గురించి మట్లాడినా "ష్ గప్ చుప్" సినిమాలో కోటా శ్రీనివాసరావు గుర్తొచ్చేవాడు..అంత ప్రేమ తనకి బందరంటె..!!
తనకి కుటుంబం కాకుండా ఇష్టమైనవి రెండే రెండు..ఒకటి బందరు, రెండు కొడి..ఎన్ని కోళ్ళకి స్వర్గం ప్రాప్తించిందో మా అమీ దయవల్ల...

ఒకరోజు స్నేహితులం అందరం కలిసి పబ్ కి వెళ్ళాం..అమెరికాలో, ఆ మాటకొస్తే జీవితంలో పబ్ కి వెళ్ళడం అదే మొదటిసారి మాలో చాలా మందికి...సాదారణంగా పబ్ లోపలికి వెళ్ళే ముందు మన వయస్సు నిర్దారించే ఒక ID తీసుకొని వెళ్ళాలి, అది చూసి, మన చేతికి ఆ పబ్ కి సంబంధించిన గుర్తు ఒకటి వేసి లోపలికి పంపిస్తారు. అందరం మా Passports తీసుకొని క్యూ లో నిలుచున్నాము..చాలా పెద్ద క్యూ ఉంది..నా వెనకాల ఉన్న అమీ కి లొపలికి వెళ్ళేవారికి ఏవో ముద్రలు వేస్తునట్టు కనిపిస్తుంది కానీ ఎక్కడ వేస్తున్నారో తెలియడం లేదు..పక్కనే ఉన్న ఇంకో స్నేహితురాలితో...
"ఏమే..ఇప్పుడు మన passport మీద stamp వేస్తాడా...మనం పబ్ కి వచ్చినట్టు అందరికీ తెలుస్తుంది కదానే..వద్దంటే విన్నావా..ఇప్పుడు చూడు passport మీద పబ్ stamp పడ్తుంది..ఏం చేయలేము.." అన్నది...ఆ మాటలకి అక్కడున్న మేమంతా కింద పడి నవ్వడం ఒక్కటే తక్కువ..!!

పబ్ లోపలికి వెళ్ళగానే అంతా చీకటి, పొగ, మసక మసకగా ఉన్న వాతావరణం చూసి...
"ఏంటే..సాంబ్రాని పొగేసాడు..." అమాయకంగా అడిగింది అమీ..
అంతే..ఈసారి కింద పడి మరీ నవ్వడం మా వంతైంది..."ఎందుకు నవ్వుతారు...అలానే ఉంది గా..."మళ్ళీ అడిగి మళ్ళీ నవ్వించింది !!
Dance రాదు అంటున్నా తీసికెళ్ళినందుకు ఒక రెండు bulb బిగించే steps ,రెండు నల్లా తిప్పే steps నేర్పించి..మొత్తానికి మా అమీతో పబ్ లో dance చేయించాము.

అలా నాలుగు కోళ్ళు, మూడు చేపలు తింటూ హాయిగా సాగిపోతున్న మా చదువు అయిపోయి..ఉద్యోగం కోసం ఒకో state లో ఒకొక్కళ్ళం పడ్డాం...అందరికంటే ముందే మన బందర్ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది..మొదటి రోజు ఎలా జరిగిందో కనుక్కుందాం అని phone చేసాను..
"మా మేనేజెర్ పెద్ద చెత్త వెదవ తాతా..మొదటి రోజని lunch కి తీసుకొని వెళ్ళాడు..అందులో chicken వాడి మొహం లాగానే ఉంది..మా cafeteria లో chicken దరిద్రం..అసలు మనుషులు ఎలా తింటారు అని కూడా లేదు వీళ్ళకి...మా బందరు లోనే ఉంటే పోయేది..హాయిగా మా అమ్మ చేసి పెట్టిన కొడి కూర తినేదాన్ని.." అంటూ చెప్తూనే ఉంది..
అసలు పని గురించీ, office లో సహుద్యోగుల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు..ఒక అరగంట అయ్యాక తన కోడి కష్టాలని చెప్పుకొని, ఉద్యోగం బాగానే ఉంది అంటూ ముగించింది.

కొన్ని రోజులు తనకి ఇళ్ళు దొరకక ఇబ్బంది పడింది..చాలా రోజులకి ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి paying guest గా మారింది..ఇంకేం ఉంది, ప్రపంచంలోని కష్టాలన్నీ తనకే వచ్చినట్టు బాధ పడింది.."ఏం అమెరికా ఇది..నాకు అయితే ఎప్పుడూ నచ్చలేదు..అదే బందర్ అయితే మా అమ్మా, మా ఇళ్ళూ, ఎదో కోడి కూర, మేక మాంసం తింటూ హాయిగా ఉండేదాన్ని..అసలు ఈ ఇంట్లో కోడి కూర చేసే వంటల programsని కూడా చూడరు తెల్సా..ఏదో అసలు option లేక నాలుకని చంపుకొని ఇక్కడ ఉంటున్నా" అంది..అప్పటికే 5 kgs తగ్గిపోయానని, ఇంకో నెల అక్కడే ఉంటే నేనే పోతానేమొ అని ఏడ్చినంత పని చేసింది.
కూటి కొసం ఉద్యోగం వెతుక్కోవడం మాలో చాలా మంది పని..కోడి కోసం ఇళ్ళు వెత్తుకోవడం అమీ పని అనట్టు అయింది.

"ఇంక గురువారం, శనివారం ఎమీ లేవు తాతా..రోజూ non-veg తినేద్దాం అని fix అయ్యాను.."
 ఆ బ్రాహ్మణుల ఇంట్లో నుండి బయటకొచ్చిన ఆనందాన్ని పంచుకుంటూ చెప్పింది గురువారం రోజున egg తింటూ.."ఈ వారం గుడ్డు తో మొదలుపెట్టాను, వచ్చే గురువారం నుండి chicken తినేస్తాను..అసలు మా కుటుంబంలో ఈ రోజు తిన్నది నేనే మొదటిదాన్ని అనుకుంటాను.." అంది ఆఖరి గుడ్డు తినేస్తూ..ఇకనుండీ ఎన్ని ప్రాణులకి మోక్షం రాబోతుందో అనుకున్నాను..

శనివారం రాత్రి మళ్ళీ phone చేసిందీ.."ఉద్యోగం అయిపోయింది తాతా..నిన్న చెప్పారు..budget issues అన్నాడు మా మేనేజెర్..ఇంకేం ఉంది..సర్దుకొని అక్క దగ్గరికి వెళ్తాను.." అంటుంటే.."పోనిలే..మంచిగా రోజూ chicken biryani తింటూ relax అవ్వొచ్చు అక్కడ..ఎలాగూ గురు,శనివారాలు కూడా తింటాను అన్నావ్ కదా..." అన్నాను..
"బాబోయి.. గురువారం తిన్నందుకే నా ఉద్యోగం పోయిందేమో, ఇంక ఆ వేంకటేశ్వర స్వామి తో games ఆడితే అమెరికా నుండే పోతానేమో అనుకొని  ఇవాళ మా వాళ్ళు కోడి చేసినా నేను తినలేదు.. .అందుకే ఇంక ఆ రెండు రోజులు non-veg తినకుండానే ఉందాం అనుకుంటున్నాను..వీళ్ళందరు తింటున్నట్టున్నారు నాకు మిగిల్చకుండా..మళ్ళీ మట్లాడతా తాతా.." అంటూ వాళ్ళ తో..
"ఏమే...తినకండే..."  

Monday, May 30, 2016

ప్రేమించిన స్నేహం

"డైరీ రాయాలేమో.."
 రెండు సంవత్సరాల ముందు రాసిన డైరీ..ఇన్ని రోజులకి రాయాలనిపిస్తుంది...తన మీద కోపంతోనా? ఇష్టంతోనా ? లేక తనని బాధపెడుతున్న నామీద నాకున్న అసహనం వల్లనా?
"హేమంత్,..ఒక్క నిమిషం నీతో మట్లాడాలని ఉంది..." తన నుండి message..
ఎన్ని సార్లు చెప్పినా,..ఎంత చెప్పినా...ఎంత తిట్టినా..ఎందుకిలా చేస్తుంది...? ఈ అమ్మాయికి పిచ్చా...?
ప్రేమా...?
ఇంత ప్రేమా?
ఎందుకు?!! నేనేం చేసానని...తనని బాధపెట్టడం తప్ప...!!
ఆ message చూసి కూడా reply ఇవ్వకుండా వదిలేసాను..
"నీ డైరీ లో ఒక్కసారైనా నా గురించి రాస్తావా..ఎప్పుడో అడిగింది...ఒక మంచి స్నేహితురాలిగా ఉన్నప్పుడు...అప్పుడు అనుకున్నాను...అంత గొప్ప స్నేహానికి ఒక పేజీ సరిపోదని...!
కాని ఇప్పుడు..ఇంత బాధపడి, నన్ను ఇంత బాధపడేలా చేస్తూ....ఒక పేజీ నిజంగానే సరిపోదు...అనుకుంటూ నా డైరీ రాద్దాం అని తీసుకున్నాను....
ఇంతలో తనే...
"ఒక్క నిమిషం మాట్లాడటానికి కూడా పనికిరానా? చాలా మాట్లాడాలని ఉంది హేమంత్...call చేయవా..."ఎంత ప్రార్దిస్తూ అడిగిందో...
వెంటనే block చేసాను whatsapp నుండి...
ఒక్కసారిగా నాలో కోపం, చిరాకు, అసహ్యం, బాధ, జాలి, ఇష్టం, తిరస్కరించడంలో కలిగే గర్వం, పొగరు, ఎన్ని emotions...అన్నీ ఒకేసారి !!
ఏ అవసరం లేకుండా....ఒక మనిషి ఇంకొక మనిషితో ఒక్క నిమిషం అయినా మాట్లాడాలి అనుకోవడం ప్రేమకి పరాకాష్ఠ...!!
ఎంత ప్రేమ నేనంటే....చాలా జాలి కలిగింది తన మీద.....కాదేమో....నా మీద నాకే...!!
ప్రేమని ఇస్తే ప్రేమే వెనక్కి వస్తుందని...రావాలని ఎప్పుడూ అనుకునే నాకు...తను ప్రేమని చూపిస్తుంటే..కోపంతో సమాధానం చెప్పాలి అనిపిస్తుంది...!
తనంటే, తనతోనే ఎప్పటికీ ఉండాలి అనిపించే అంత ఇష్టం లేదని ఎన్ని సార్లు, ఎలా చెప్పినా అర్థం చేసుకుంటూ కూడా అర్థం కానట్టు తను చుపించే ప్రేమకి ఈ కోపమే సమాధానం..ఇదే మంచిదేమో..!!
"నేనంటే కొంచం కూడా ఇష్టం లేదా..ఒక్కసారి మాట్లాడవా..." ఈ సారి text message చేసింది.
ఈ mesages ఆగవు...రాయాలి అనుకున్న డైరీ పక్కన పడేసి ...ఏమైనా తినాలనిపించి మొన్న తనే పంపించిన పూతరేకుల్ని తెచ్చుకొని తింటున్నాను..
ఈ సారి call చేసింది...cut చేసాను...
ఎంత Irony...తను పంపిన sweets ఇష్టంగా తింటూ...తనని మాత్రం దూరం పెడుతూ..ఒక స్నేహితురాలని ఎంత బాధపెడుతున్నాను..నేను నేనేనా?
మళ్ళీ call...lift చేసాను.
"ఏం కావాలి నీకు...?" అరిచాను...
"ఏం చేస్తున్నావ్...?"
"నేనేం చేస్తే నీకెందుకు...?"
"నాతో మామూలుగా..అంతకుముందులాగా మాట్లడలేవా.."
"నువ్వు నాతో మామూలుగా ఉండలేవు...నేను మామూలుగా మాట్లడలేను.."
"........"
"ఇప్పుడెందుకు calls చేస్తున్నావ్...?"
"గుర్తొస్తున్నావ్...చాలా...ఒక్కసారి కలవచ్చా..."
"నాకు మా ఇంట్లో వాళ్ళు రోజూ గుర్తొస్తున్నారు...అలాగని వేరే దేశంలో ఉన్న వాళ్ళని కలవాలి అనుకుంటున్నా కలుస్తున్నానా?! ఎన్నో అనిపిస్తాయి..అన్నీ జరగవు..."
"ఒకే ఒక్కసారి కలవలేవా.."
"నేను ఒక్కసారే చెప్తాను..."
"నేను ఇంక నీకు ఎప్పటికీ కనిపించను...ఒక్కసారి.." అని ఏదో అనబోతుంతే...
"అంత అదృష్టమా నాకు..."
"ఎందుకు అంత rudeగా మాట్లాడతావ్...మామూలుగా...."
"నా time waste చేయకు...నీకేం కావాలి..."
"ఎమీ వద్దు...ఇష్టం లేకుండా మాట్లాడకు...call cut చేసేయ్ ..."
"Thanks,...bye"
"నేను ఇక్కడినుండి వెళ్ళీపోతున్నాను...."
"Get Lost...I don't Care" అని cut చేసాను...!!
ఆశ్చర్యం...అది నేనేనా! ఎంత అగౌరవంగా, ఎంత నిర్దయగా, ఎంత కఠినంగా, ఎంత క్రూరంగా, ఎంత సులువుగా, ఎంత Insensitive గా ఒకరిని అవమానపరిచాను..నిజంగా నేనేనా?
"నేను నీకు చాలా చులకన అయిపోయాను కదా హేమంత్.." తనకి ఈ సారి reply ఇచ్చాను...
"అంత చులకన అయ్యావ్ అని తెలిసి కూడా ఇంకా నాతో మాట్లాడాలని చూస్తున్నావ్ అంటే నిన్ను ఎమనుకోవాలి...?" message send చేసాను.
మళ్ళీ నేనే...నేనేనా..?? ఎంత rude గా మాట్లాడుతున్నాను..!!
నాలోని సున్నితత్వం ఏమయింది? నాలోని compassion ఏమయింది..?
ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి తెలిసి అదే బాధని ఇంకొక మనిషికి ఇస్తున్నానంటే...నాలోని మనిషి ఏమయినట్టు?
"నేనంటే కొంచం కూడా గౌరవం, ఇష్టం లేదని get lost అన్నప్పుడే అర్థం అయింది కానీ....." ఒక పెద్ద message...!!
ఎలా చెప్పాలి తనకి..తనంటే ఎంత గౌరవం ఉందో...ఒక స్నేహితురాలిగా తనంటే ఎంత ఇష్టం ఉందో..అవి చూపించటానికి కూడా వీలు లేనంత ప్రేమని తను చూపిస్తూ..తన ప్రేమని గెలిపించుకోవాలని ఆరాటపడి, ఓడిపోయి, ఆ స్నేహాన్ని తుంచేసి,  మళ్ళీ అదే స్నేహం కావాలి అనుకోవడం,..తన అమాయకత్వమా? తెలిసీ తెలియనితనమా?!
"Once gone is gone forever" అని ఎవరు చెప్పాలి తనకి?
ప్రపంచంలో అన్నిటికన్నా సులువైన పని ప్రేమించడం, అన్నిటికన్నా కష్టమైన పని అంత గొప్ప ప్రేమని తిరస్కరంచడం....!!
నేను చదివిన ఒక్క పుస్తకంలోను ప్రేమని తిరస్కరించడంలో ఉన్న బాధని,ఒక ప్రేమకుడిని లేదా ప్రేమికురాలిని చిన్నచూపు చూడటంలో ఉన్న సంఘర్షననీ ఎవరూ రాయలేదే? నేనే రాయాలేమొ...ఏమో..అందరికీ ఇంత inner conflict ఉంటుందా?
నేనే ఎక్కువ అలోచిస్తున్నానా? లేక తన ప్రేమ అలోచించేలా చేస్తుందా?
ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు...మళ్ళీ అనిపించింది...
"డైరీ రాయాలేమో..." !!!

Monday, January 25, 2016

అమ్మ-అమెరికా

"సగం తాగి పడేయొద్దని ఎన్ని సార్లు చెప్పాలి...మళ్ళీ దొరుకుతాయా? కొంచమన్న బుద్ధి పెడితే బాగుండు దేవుడు.."..
నేను పాలు వదిలేసినప్పుడల్లా వినిపించే మాట ఇదే..చిన్నప్పటినుండీ అదే మాట, అవే తిట్లు,..అదే శ్రుతిలో ఒకేలా తిట్టడం ఒక్క అమ్మలకే సాధ్యం ఏమో..!
   టీక్...టీక్...టీక్...శబ్ధంతో ఆలోచనల నుండి బయటకొచ్చి oven లో ఉన్న పాలు తీసి తాగబోయాను...తాగలి అనిపించదు...కాని తప్పదు..ఆకలి తీరటానికి పాలకన్నా సులువైన మార్గం ఇంకోటి లేదు..పాలు మొత్తం తాగాను...!! అమ్మ గుర్తొచ్చింది వెంటనే..!!
బయటకి వెళ్తుంటే నవ్వొస్తుంది చీమల వరుసలా వెళ్ళే వాహనాల మధ్యలో నేను..చుట్టూ మనుషులు కనిపించరు..కార్లే కనిపిస్తాయి..
"ఇక్కడ మనుషులు ఉండరు...machines మాత్రమే ఉంటాయి" అని నేను ఈ దేశానికి వచ్చే ముందు చెప్పిన స్నేహితుడిని రోజూ తలచుకుంటా ఈ సమయంలో....
మన దేశంలోనే నయం...మనుషులు, కుక్కలూ, పందులూ....కనుచూపులోనే వందల మంది జీవితాలని చూడొచ్చు....అందుకే నా దేశానికి అంత విలువ ఉందేమో.. !!
     ఆఫిస్ రాగానే ఆలోచనలన్నీ సషేశంగా ఆగిపోయాయి..ప్రతి ఒక్కరు నవ్వుతూ "hello, hii" అని పలకరిస్తారు...నాకు వాళ్ళని పట్టుకొని నేను నీకు ఎన్ని రోజుల నుండి తెలుసు చెప్పు అని అడగాలి అనిపించేది మొదట్లో...ఇప్పుడు నేనూ వాళ్ళలో కలిసిపోయాను..!!
ఎంతో అందమైన దేశం..ఎటు చూసినా పచ్చదనం, కాకపోతే అది కూడా వీళ్ళ నవ్వులాగానే ఉంటుంది జీవం లేనట్టు..!!
        "పైన ఇంకొంచం కూర పెట్టాను..అది కూడా కలుపుకొని తిను..పెరుగన్నం డబ్బా మొత్తం ఖాలి చేసెయ్..మళ్ళీ ఇంటికి తీసుకురాకు, మొత్తం తినాలి..అర్థం అయిందా.."బడికి వెళ్తుంటే సుప్రభాతం లాగా ప్రతిరోజూ ఇదే వినిపించేది అమ్మ...
ఇప్పుడు నా డబ్బాలో గిన్నెలు ఎక్కువ, కూరలు తక్కువ..!!
           సాయంత్రం ఇంటికి రాగానే నా పాలిట నక్షత్రకుడు phone చేసాడు..నేను ఎక్కడికీ రాను మొర్రో అంటున్నా...బలవంతంగా నన్ను తీసుకొని వెళ్ళడం వీడు కంకణం కట్టుకోకుండా చేసే పని...నాకు ప్రపంచం చూపిస్తున్నాను అనుకుంటాడు...వీడికేం తెలుసు నా ప్రపంచం ఎక్కడ ఉందో..!!
"బయటకి వెళ్దాం పద...pubకి వెళ్దామా...bowlingకి వెళ్దామా...??"
"నేను ఎక్కడికీ రాను...ఇవాళ వదిలెయ్ నన్ను" అన్నాను..యే mood లో ఉన్నాడో వదిలాడు తొందరగానే...!!
ఉదయం ఆలోచనలతో..రాత్రి phones తో..ఇదే జీవితం..అమ్మ కి phone చేసాను...lift చేయలేదు..పూజ లో ఉందేమో..!!
ఇంతలో చిన్ననాటి స్నేహితుడు whatsappలో message చేసాడు phone చేయమని...చేస్తూనే నేను ఎంత ఆనందంగా ఉంటున్నానో వాడే చెప్తున్నాడు....వీడికెలా చెప్పేది?!....సంతోషం అంటే మనం తిరిగే ప్రదేశాలూ,facebook checkins కాదని...!!
"చూస్తున్నా..చూస్తున్నా..మొత్తం అమెరికా చుట్టేస్తున్నావ్....నీకెంటి బాగ సంపాదిస్తునట్టు ఉన్నావ్..ఇంక పెళ్ళి చేసుకో మామా...settle అయిపోతావ్..నాకు కూడా అమెరికా రావాలని ఉందిరా...process చెప్పు..బాగా enjoy చెయ్యాలి వచ్చి..."
... వాడి మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అనుకోలేదు..ఎందుకంటే...వాడికిది స్వర్గం..నాకు వాడు ఉంటున్నది స్వర్గం..దూరపు కొండలు నునుపు అని అందుకే అంటారేమో...
      ఎవేవో మాట్లాడుతూ ఉన్నాడు..."అమ్మా..ఇంకో రెండు దోసలెయ్.." అరిచాడు నాతో మట్లాడుతూనే....అప్పుడు చెప్పాను...
"ఇక్కడ అన్నీ ఉంటాయ్రా...అమ్మ తప్ప..."అని..
వాడికి అర్థం అయిందేమో...అమ్మ పిలుస్తుందిరా, మళ్ళీ మట్లాడుతా అన్నాడు..!!

Wednesday, November 11, 2015

సశేషం...

బాగున్నావా? అని ఎంత సులువుగా అడిగావు...నీ పలకరింపు ఎన్ని జ్ఞాపకాలను నిద్రలేపిందో నీకు తెలుసా...
'అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే...' అని ఒక కవి అన్నట్టు...అలసిపోయాను...నీ గురించి అలోచించి..నీకై ఎదురుచూసి..నీ ప్రతీ కదలికని గమనిస్తూ...నీ ప్రతీ ఇష్టాన్నీ ఆరాధిస్తూ...నీ అలోచనలతో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి..నిన్ను నాలో నింపుకొని...నేనే నువ్వై..ఆ నాలోని నిన్నుని దూరం చేసుకోవడానికి కష్టపడి...ఇంకా కష్టపడుతూ...నువ్వు లేకుండా కూడా ఉండగలను అని స్థిమిత పడే సమయంలో...మళ్ళీ నువ్వు...మళ్ళీ నా నువ్వు....'నా నువ్వు' అనవచ్చో లేదో సందేహమే ఇంకా...

                *......................*..........................*...............................*..........................*

కొన్ని భావాలు ఇలా అసంపూర్ణంగా ఉంటేనే అందంగా ఉంటాయని నమ్ముతూ....

Wednesday, December 31, 2014

నీతో ఆ సాయంత్రాలు...

మన ఊహలు చెదిరిపోవచ్చు....మన స్నేహం సమసిపోవచ్చు..
కానీ గుర్తున్నాయా?!!
మనం మార్చలేని ఆ క్షణాలు...
నీ ఏకాంతాన్ని నేను ఏలిన సమయాలు...
నీ వాంఛ...నీ స్పర్ష...నీ మనసు...నీ ఆత్మ....అన్నీ నావై...నాలోన నువ్వు కలిసిపోయిన అందమైన వెన్నెల రాత్రులు...
సజీవమై నిదురిస్తున్నాయి తెలుసా....కాలం అనే వెచ్చని పానుపులో..!!!