Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Thursday, February 9, 2012

సిరివెన్నెల....తిట్టిండ్రా--పొగిడిండ్రా??!!

 సినిమా పాటల్లో స్త్రీని వర్ణించమనంగనే మన సినీ కవులు వారిని దివిలో ఉండే పారిజాతాలుగానో,నింగి,నేల తానై నిండిన శక్తి గానో,జీవన జ్యోతులు గానో,త్యాగ మూర్తులు గానో,ఎగసి పడే సముద్రం గానో,...ఇట్లా రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు.
               అయితే సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు రాసిన "మహిళలు మహరాణులు" పాట వీటన్నిటికీ భిన్నంగా ఉండి,స్త్రీ తత్వాన్ని మొత్తం మన ముందు ఉంచుతది..ఆయనకు మాత్రమే సాధ్యమైన విద్య ఇది అనిపిస్తది ఇది చదువుతుంటే....."జాన జాన పదాలతో..జ్ఞాన గీతి పలుకునటే.." అని 'ఆపద్బాందవుడు' సినిమాలో ఆయనే రాసినట్టు..చిన్నోళ్ళు కూడా అర్దం చేసుకునే భాషలో,అంతే లోతైన భావంతో ఉంటది ఈ పాట.

  ఈ పాటలో 'అతి' ఉండదు.....స్త్రీలని తిట్టినా,పొగిడినా అవి అందరూ ఒప్పుకునే నిజాలే...అసలు తిడుతుండ్రా పొగుడుతుండ్రా అని మనకి అర్దం కాదు..సిరివెన్నెల రాసిన నిందా స్తుతి గీతం అనంగనే గుర్తుకువచ్చే పాట "ఆదిభిక్షువు వాడినేది కోరెదీ..",అయితే అది ఒక్క దేవుని /ఒక వ్యక్తి లక్షణాలకి మాత్రమే పరిమతమయ్యే పాట...కాని ఈ పాట మాత్రం సృష్టిలోని స్త్రీలందరికీ ఆపాదించగలిగే పాట....
 

మనం గమనిస్తే,..ఒక వాఖ్యంలో స్త్రీలోని గొప్ప గుణాన్ని చెప్తూ,,..దాని వెనువెంటనే వచ్చే వాఖ్యంలో మహిళలోని మరో కోనాన్ని స్పృశిస్తూ అందంగా సాగిపోతుందీ గీతం...అంతే అందంగా పాడిండ్రు మన బాలు గారు.."ఆడదే ఆధారం" చిత్రం లోనీ ఈ పాటకి సంగీతం అందించింది శంకర్ గణేష్.

 మహిళలు మహరాణులు...
పచ్చనైన ప్రతి కథకు తల్లి వేరు పడతులు..
భగ్గుమనే కాపురాల అగ్గి రవ్వ భామలు..
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు..
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు..           
...మహిళలు మహరాణులు...

ఆశ పుడితే తీరు దాకా ఆగరు యెలనాగలు..
సహనానికి నేల తల్లిని పోలగలరు కొలతులు..
అమ్మగా
లోకానికే ఆయువిచ్చు తల్లులు..
అత్తగా అవతరిస్తె వారే అమ్మతల్లులు..

ఆడదాని శత్రువు మరో ఆడదనే అతివలు..
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు..
అర్ధమవరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు..            
...మహిళలు మహరాణులు...

విద్య ఉన్నా విత్తమున్నా వొద్దికెరుగని వనితలు..
ఒడ్డు దాటే ఉప్పెనల్లే ముప్పు కాదా ముదితలు
పెద్దలను మన్నించే పద్ధతే వద్దంటే
మానమూ మర్యాదా ఆగునా ఆ ఇంట
కన్నులను కరుణ కొద్దీ కాపాడే రెప్పలే
కత్తులై పొడిచెస్తే ఆపేదింకెవరులే
వంగి ఉన్నా కొమ్మలే బంగారు బొమ్మలు              ...
మహిళలు మహరాణులు...


ఇట్లా స్త్రీలనూ,వారి స్వభావాన్ని చెట్టువేరుతోనూ,అగ్గిరవ్వతోనూ,ఇంధనంతోనూ,కొమ్మలతోనూ పోలుస్తారు...ఈ పోలికలు ఒక ఎత్తు,కనురెప్పలతో పోల్చడం ఒక ఎత్తు అనిపిస్తది నాకు..సున్నితమైన స్త్రీలను..అంతే సున్నితమైన కనురెప్పలతో పొల్చడం ఎంత బాగుంది...!!
ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవల్సిన పాట ఇది..

చివరగా,..'భారత ప్రభుత్వం' గనక నాదే అయితే...ఈ ఒక్క పాటకే సిరివెన్నెలకి "పద్మశ్రీ" ఇచ్చెటోడ్ని..!!

Saturday, February 4, 2012

"రామాయణ విషవృక్షం"-రాముడు దేవుడా?!

"రామాయణ విషవృక్షం"( మొదటి భాగం)అనే ఈ పుస్తకం చదివి నాలో కలిగిన అలోచనలు,అభిప్రాయాలు,అన్నిటికంటె ముఖ్యంగా ఈ పుస్తకంలోని విషయాలను తెలియపరచాలనే ఉద్ధెశ్యంతో ఇది రాయడం జరిగింది..
 

"రామాయణ విషవృక్షం",(రచన-రంగనాయకమ్మ,..విశ్వనాధ సత్యనారాయణ గారు "రామాయణ కల్పవృక్షం" అని రాస్తే దానికి సమధానంగా "విషవృక్షాన్ని" రాసారని విన్నాను..అది ఎంత వరకు నిజమో తెలియదు మరి.. ),అని చూడగానే ఎదో ప్రత్యేకమైన నవల అని చదవడం మొదలుపెట్టాను...నాలుగు పుఠలు చదవగానే రాముడిని ఒక మోసగాడిగా,అజ్ఞానిగా, ఎన్నో అవలక్షనాలు,దుర్గుణాలూ ఉన్న రాజుగా రచయిత్రి చేసిన వర్ణన నచ్చక చాలా రొజులు మళ్ళీ ఆ పుస్తకం  తెరవలేదు.కొన్ని రొజుల తర్వాత 'రాముడు దేవుడు' అనే నా నమ్మకాన్ని పక్కన పెట్టి ఆ పుస్తకాన్ని తిరిగి చదవడం ప్రారంభించాను.

 అసలు ఈ పుస్తకం ముఖచిత్రమే వింతగా ఉంటుంది..శ్రీరాముడు వెనుక నడుస్తూ,లక్ష్మణుడు మూట,ముల్లె,దనుర్బాణాలూ మోస్తూ ముందు నడుస్తుంటాడు..సీత వారిరువురికి మద్యలో  ఉంటుంది..రాముడు ధీరుడైతే అడవిలో ముందు నడవాలి కానీ,పిరికి వాని లాగా వెనక నడవడం ఎందుకు? అనే సందేహం మనకి కలుగుతుంది..ఈ ముఖచిత్రాన్ని వేయమని ఒక ప్రముఖ చిత్రకారుడిని కోరితే,.."రామ-రామ" అని రాసి రచయిత్రి పంపిన డిమాండ్ డ్రాఫ్ట్ ని వెనక్కి పంపించారట..(ఆ చిత్రకారుని పేరు రచయిత్రి ప్రస్తావించలేదు కానీ,అది ఖచ్చితంగా బాపు గారే).ఇది రచయిత్రి సృష్టించిన బొమ్మ మాత్రమే అని మనం అనుకోవడానికి వీలు లేదు...వాల్మీకి రాసిన శ్లోకాలతో సహా ఉదహరిస్తూ రాముడే లక్ష్మణుడిని తన జాగ్రత్త కోసం,రక్షణ కోసం ముందు నడవమని ఆజ్ఞాపించాడని నిరూపిస్తారు రచయిత్రి.

ఇక ఈ పుస్తకంలోని ప్రతి వాక్యం,ప్రతీ అక్షరం తర్కంతో కూడుకున్నదే...రామాయణాన్ని దోపిడీ వర్గానికి 'అందమైన కావ్యం' అని వర్ణిస్తూ...రచయిత్రి ఎంతో చక్కగా మానవ పరిణామ క్రమాన్ని..సాంఘికంగా,సామాజికంగా,రాజకీయంగా,ఆర్దికంగా మనవ జీవనాల్లో వచ్చిన మార్పులను,కుల వ్యవస్థ మొదలైన క్రమాన్ని,స్త్రీలు స్వతంత్ర హీనులుగా,బానిసలుగా,వేశ్యలుగా మారిన క్రమాన్ని,మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థగా ప్రపంచం మారిన క్రమాన్ని,ధనికులు,పేదలు,కులాలు,మతాలు,కట్టుబాట్లు ఏర్పడిన వైనాన్ని,'వేదాలు','పురాణాలు' వంటివి రాయబడిన సందర్బాన్ని,ఆదిమానవుని గణ వ్యవస్తను,ఫ్యూడల్,పెట్టుబడిదారీ,కమ్యునిస్టు  వ్యవస్తలను కూలంకషంగా విశదీకరించారు.

 రామాయణం గురించి తెలుసుకునేటప్పుడు అది చరిత్ర పరిణామ క్రమంలో ఏ దశలో వుద్బవించిందో,ఏ  వ్యవస్తలని కాపాడటానికి,ఏ వర్గాన్ని బలపరచడానికి,ఏ ధర్మాల్ని శాశ్వతంగా ఉంచడానికి నిర్దేశించబడిందో,.ఎవరి ప్రయోజనాల కోసం ప్రచారం చెయ్యబడుతుందో తెలియజెప్పటానికి చరిత్ర క్రమం అంతా వివరిస్తారు.రామాయణం కథ ఫ్యూడల్ దశను,ఫ్యూడల్ వ్యవస్థను బలపర్చడానికే పుట్టిన కథ అని రచయిత్రి అభిప్రాయం(అది ఎంత నిజమో పుస్తకంలోని రామాయణం చదువుతుంటే మనకి అర్థం అవుతుంది.ఇది రచయిత్రి సొంతగా రాసిన రామాయణం కాదు,.వాల్మీకి రామాయణమే).

ఈ పుస్తకం చదివే క్రమంలో రామ-రావణ యుద్ధం ఆర్య-ద్రవిడుల మధ్య జరిగిన ఘర్షనగా,రామాయణం ఆర్యుల కోణం నుంచీ,ఆర్యుడు రాసిన పుస్తకం కాబట్టి,శివుడిని కీర్తించే ద్రావిడులను(రావణుడు) రాక్షసులుగా చిత్రీకరించారనే కొత్త కోణంలో రామాయణాన్ని తెలుసుకుంటాం..."రాముడు ఆర్యభూమి విస్తరణకే కదా జన్మించింది.." అని విశ్వామిత్రుడు దశరధుడితో అనే మాటల వల్ల అది రుజువు అవుతుంది కూడా..
                                     అదే విశ్వామిత్రుడు దశరధుడితో "బ్రాహ్మణులకి ధాన-ధర్మాలు బాగా చేస్తున్నావా?నాస్తికులను అణచివేస్తున్నవా?కులసంకరం జరగటం లేదు కదా? శూద్రులు అందరినీ సేవిస్తూ,అణిగి మనిగి ఉంటున్నారు కదా?" లాంటి ప్రశ్నలు వేస్తాడు...అలాగే తాటకితో యుద్ధం చేసే సమయంలో రాముడితో "ప్రజలంటే బ్రాహ్మణులే,వేద శాస్త్రాలు చదవడానికి అర్హతలేని శూద్రులు,తక్కువ జాతివారు ప్రజలు కారు" అంటాడు...ఇంకో సందర్బంలో కైకేయి దశరధుడితో "ఎప్పుడూ తమ కష్టాలని పెడచెవిన పెట్టే రాజుల కోసం ప్రజలు కన్నీరు కారుస్తారా?" అంటుంది,అలాగే ఒకసారి గుహుడు లక్ష్మణుడితో "రాజకులంలో పుట్టారు,మీరు కష్టపడటం ధర్మం కాదు..మావంటి వారికి నిద్రాహారాలు లేకపోయినా పర్వాలేదు" అని అంటాడు...ఈ ప్రశ్నల వల్లా,ఈ సంబాషణల వల్లా కులవ్యవస్త ఆనాటి నుండి ఉందనీ,తక్కువ జాతి వారిని అణగదొక్కటమే లక్ష్యంగా వ్యవస్తలు,రాజులు పని చేసారని అర్థం అవుతుంది..పితృవాఖ్య పరిపాలనా,సీతా దేవి భర్తను అనుసరించి పతివ్రత అనిపించుకోవాలని అనుకోవడం మొదలైనవన్నీ పితృస్వామ్య వ్యవస్తను బలపర్చడానికీ,స్త్రీలను అదుపు,ఆజ్ఞలలో ఉంచడానికి పుట్టుకు వచ్చిన కథలు,నీతులు మాత్రమే అని తేటతెల్లమవుతుంది.

అదే విధంగా దశరధుడికి ముగ్గురు భార్యలు మాత్రమే కాక,ఇంకా 350 మంది భార్యలు ఉన్నారనీ,అసలు కైకేయిని వివాహం చేసుకునేముందు దశరధుడు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యం భరతుడికే చెందుతుందనీ,అరణ్యాలకు వెళ్ళినపుడు సీత పట్టుచీరాలే తప్ప నార చీరలు కట్టలేదని..ఇలా ప్రచారంలో లేని వాస్తవాలను ఎన్నో తెలుసుకుంటాం!!

 అలాగే దశరధుడు వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించిన తరువాత రాముడు తన తల్లి కౌసల్య తో,తమ్ముడు లక్ష్మణుడితో,భార్య సీతతో,.."తండ్రి మాట వింటేనే పుణ్యం వస్తుంది,స్వర్గ ప్రాప్తి కలుగుతుంది,అరణ్యాలకి వెళ్ళడం తోటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయ్" అని చెప్పే సన్నివేశం రామునిలోని స్వార్ద కోణాన్ని మన ముందుంచుతుంది.మరో సంధర్బం లో రాముడు లక్ష్మణుడితో "మాతో పాటు వనవాసానికి నువ్వు రావడం మంచిదైంది..లేకపోతే సీతని కాపాడటం నా ఒక్కడికీ కష్టమయ్యేది.." అని అంటాడు తన వీర లక్షణాన్ని తెలియజేస్తూ..!!
           మరో సారి తన తమ్ముడితో పినతల్లి కైకేయిని 'మదం ఎక్కిన వనిత' అని దూషిస్తాడు..తన తండ్రిని బుద్ధిహీనుడని నిందిస్తాడు,కాదు,తన మనసులోని మాటలను బయటపెడతాడు....ఈ విధంగా రాముడు స్థితప్రజ్ఞత లేని వాడిగా,రాజ్యకాంక్ష,కీర్తి కాంక్ష గలవాడిగా,భయస్తుడిగా మనకి దర్శనం ఇస్తాడు చేసే ప్రతి పనిలో,మాట్లాడే ప్రతి మాటలో...

 రాముడు లక్ష్మణుడికి చెప్పే ప్రతి పనిలో ఒక దర్పం కనిపిస్తుంది...యజమాని సేవకుడికి కార్య భారం అప్పగిస్తూ ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడో,అదే స్వభావాన్ని రాముడు లక్ష్మణుడికిచ్చే ఆజ్ఞల్లో మనం గమనించవచ్చు..రాముడికీ,లక్ష్మణుడికీ  ఉన్నది అన్నదమ్ముల అనుబంధం కాదు,.యజమాని,బానిసల సంబంధం.పుస్తకం చదువుతున్నప్పుడు ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది.

 రచయిత్రి తన సహజ దోరణిలో రాయడం వలన హాస్యం,వ్యంగ్యం పాలు కూడా ఎక్కువగానే ఉంటాయి....ముఖ్యంగా దశరధుడు చనిపోయి,ఆత్మగా మారిన తరువాత వివరించిన సన్నివేశం(ఇది రచయిత్రి కల్పన కావచ్చు),లక్ష్మణుడి ఇంగితం మాట్లాడే మాటలు,గుహుడి స్వబావం వర్ణించిన తీరు,భరతుడితో రాముడి సంభాషణ గురించి చెప్పిన తీరు మనకి నవ్వు తెప్పిస్తాయి.

 ఈ విధంగా ఈ పుస్తకంలో తర్కం,హాస్యం,జ్ఞానం అన్నీ ఉన్నాయి..అలాగే ప్రతీ పాత్రా రాముడిని ఉన్నతుడిని చేయడానికి తనని తాను హీనం చేసుకునేటట్టు వాల్మీకి రాయడం వంటి విషయాలని చూపిస్తారు(వాల్మీకి రాసిన రామాయణ అనువాద శ్లోకాలని సంఖ్యలతో సహా ఉదహరిస్తారు రచయిత్రి).ఇలా కొందరికి మాత్రమె ప్రయోజనకరంగా ఉండే సంప్రదాయాలని,వాటిని బలపరిచే సామజిక స్వభావాన్ని ఉటంకిస్తుంది మన పవిత్ర గ్రంధం.

 ఈ మొదటి భాగం లో బాలకాండ,అయోధ్యకాండ,సింహాసనం చెప్పుల పాలవడం,అరణ్యకాండ గురించి రాసారు.ఈ కొన్ని విషయాలు తెలుసుకున్నందుకే రామాయణం నిజంగా ఒక విషవృక్షం అనే సంగతి మనకి బోపడుతుంది..ఎన్నో అవలక్షణాలు గల రాముడు దేవుడా? అనే సందేహం కలుగుతుంది.నిత్యం మనం స్మరించే రామాయణంలో ఇన్ని నిగూఢ విశేషాలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది...రాముడి స్వభావం ఇంతేనా అని బాధ కలుగుతుంది....!!

ఆస్తికుడైనా,నాస్తికుడైనా,...తర్క జ్ఞానాన్ని నమ్మే ప్రతీ ఒక్కరు చదవవలసిన పుస్తకం ఇది..