Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Friday, September 8, 2017

బందర్ to అమెరిక

"ఏమే...తినకండే.."
"అసలు మనసాక్షి ఉందానే మీకు...నాకు కొంచం అయినా మిగిల్చండి...ఎలా తినగలుగుతున్నారసలు...?"
గురువారం రాత్రి సమయంలో వాళ్ళ ఇంటి తలుపు దగ్గర నిలబడి స్నేహితురాలితో మట్లాడుతున్న నాకు ఈ మాటలు వినిపించాయి..మనిషి కనపడలేదు కానీ ఆ అమ్మాయికి పాపం తినడానికి ఏం లేదేమో అనుకున్నాను..అసలు విషయం కనుక్కుంటే నవ్వాగలేదు..ఆ అమ్మాయి గురువారం non-veg తినదు..కానీ తనకి chicken అంటే ప్రాణం, రోజూ తింటుంది..ఒక్క గురువారం, శనివారం తప్ప...ఆ రెండు రోజులూ 12 గం. తరువాత తింటుంది కోడి కి అన్యాయం చేయకుండ..

"నాకు chicken తినకపోతే తిన్నట్టే ఉండదు తాతా..ఆ గురువారం, శనివారం ఎలాగో దేవుడి పేరు చెప్పి కళ్ళు మూసుకుంటా.." అంది మా పరిచయం స్నేహంగా మారాక...తనకన్నా 5 సంవత్సరాలు పెద్ద అయిన నేరానికి నన్ను ఆప్యాయంగా తాతా అంటుంది..నేను ఆనందంగా మర్చిపోయి జీవిస్తున్న నా వయస్సు పెరుగుతుంది అని గుర్తుచేస్తూ..

"బందరులో మా అమ్మ చేసే కొడి కూరంటేనే ఇష్టం" అనేది...నాకెప్పుడు తను బందరు గురించి మట్లాడినా "ష్ గప్ చుప్" సినిమాలో కోటా శ్రీనివాసరావు గుర్తొచ్చేవాడు..అంత ప్రేమ తనకి బందరంటె..!!
తనకి కుటుంబం కాకుండా ఇష్టమైనవి రెండే రెండు..ఒకటి బందరు, రెండు కొడి..ఎన్ని కోళ్ళకి స్వర్గం ప్రాప్తించిందో మా అమీ దయవల్ల...

ఒకరోజు స్నేహితులం అందరం కలిసి పబ్ కి వెళ్ళాం..అమెరికాలో, ఆ మాటకొస్తే జీవితంలో పబ్ కి వెళ్ళడం అదే మొదటిసారి మాలో చాలా మందికి...సాదారణంగా పబ్ లోపలికి వెళ్ళే ముందు మన వయస్సు నిర్దారించే ఒక ID తీసుకొని వెళ్ళాలి, అది చూసి, మన చేతికి ఆ పబ్ కి సంబంధించిన గుర్తు ఒకటి వేసి లోపలికి పంపిస్తారు. అందరం మా Passports తీసుకొని క్యూ లో నిలుచున్నాము..చాలా పెద్ద క్యూ ఉంది..నా వెనకాల ఉన్న అమీ కి లొపలికి వెళ్ళేవారికి ఏవో ముద్రలు వేస్తునట్టు కనిపిస్తుంది కానీ ఎక్కడ వేస్తున్నారో తెలియడం లేదు..పక్కనే ఉన్న ఇంకో స్నేహితురాలితో...
"ఏమే..ఇప్పుడు మన passport మీద stamp వేస్తాడా...మనం పబ్ కి వచ్చినట్టు అందరికీ తెలుస్తుంది కదానే..వద్దంటే విన్నావా..ఇప్పుడు చూడు passport మీద పబ్ stamp పడ్తుంది..ఏం చేయలేము.." అన్నది...ఆ మాటలకి అక్కడున్న మేమంతా కింద పడి నవ్వడం ఒక్కటే తక్కువ..!!

పబ్ లోపలికి వెళ్ళగానే అంతా చీకటి, పొగ, మసక మసకగా ఉన్న వాతావరణం చూసి...
"ఏంటే..సాంబ్రాని పొగేసాడు..." అమాయకంగా అడిగింది అమీ..
అంతే..ఈసారి కింద పడి మరీ నవ్వడం మా వంతైంది..."ఎందుకు నవ్వుతారు...అలానే ఉంది గా..."మళ్ళీ అడిగి మళ్ళీ నవ్వించింది !!
Dance రాదు అంటున్నా తీసికెళ్ళినందుకు ఒక రెండు bulb బిగించే steps ,రెండు నల్లా తిప్పే steps నేర్పించి..మొత్తానికి మా అమీతో పబ్ లో dance చేయించాము.

అలా నాలుగు కోళ్ళు, మూడు చేపలు తింటూ హాయిగా సాగిపోతున్న మా చదువు అయిపోయి..ఉద్యోగం కోసం ఒకో state లో ఒకొక్కళ్ళం పడ్డాం...అందరికంటే ముందే మన బందర్ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది..మొదటి రోజు ఎలా జరిగిందో కనుక్కుందాం అని phone చేసాను..
"మా మేనేజెర్ పెద్ద చెత్త వెదవ తాతా..మొదటి రోజని lunch కి తీసుకొని వెళ్ళాడు..అందులో chicken వాడి మొహం లాగానే ఉంది..మా cafeteria లో chicken దరిద్రం..అసలు మనుషులు ఎలా తింటారు అని కూడా లేదు వీళ్ళకి...మా బందరు లోనే ఉంటే పోయేది..హాయిగా మా అమ్మ చేసి పెట్టిన కొడి కూర తినేదాన్ని.." అంటూ చెప్తూనే ఉంది..
అసలు పని గురించీ, office లో సహుద్యోగుల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు..ఒక అరగంట అయ్యాక తన కోడి కష్టాలని చెప్పుకొని, ఉద్యోగం బాగానే ఉంది అంటూ ముగించింది.

కొన్ని రోజులు తనకి ఇళ్ళు దొరకక ఇబ్బంది పడింది..చాలా రోజులకి ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి paying guest గా మారింది..ఇంకేం ఉంది, ప్రపంచంలోని కష్టాలన్నీ తనకే వచ్చినట్టు బాధ పడింది.."ఏం అమెరికా ఇది..నాకు అయితే ఎప్పుడూ నచ్చలేదు..అదే బందర్ అయితే మా అమ్మా, మా ఇళ్ళూ, ఎదో కోడి కూర, మేక మాంసం తింటూ హాయిగా ఉండేదాన్ని..అసలు ఈ ఇంట్లో కోడి కూర చేసే వంటల programsని కూడా చూడరు తెల్సా..ఏదో అసలు option లేక నాలుకని చంపుకొని ఇక్కడ ఉంటున్నా" అంది..అప్పటికే 5 kgs తగ్గిపోయానని, ఇంకో నెల అక్కడే ఉంటే నేనే పోతానేమొ అని ఏడ్చినంత పని చేసింది.
కూటి కొసం ఉద్యోగం వెతుక్కోవడం మాలో చాలా మంది పని..కోడి కోసం ఇళ్ళు వెత్తుకోవడం అమీ పని అనట్టు అయింది.

"ఇంక గురువారం, శనివారం ఎమీ లేవు తాతా..రోజూ non-veg తినేద్దాం అని fix అయ్యాను.."
 ఆ బ్రాహ్మణుల ఇంట్లో నుండి బయటకొచ్చిన ఆనందాన్ని పంచుకుంటూ చెప్పింది గురువారం రోజున egg తింటూ.."ఈ వారం గుడ్డు తో మొదలుపెట్టాను, వచ్చే గురువారం నుండి chicken తినేస్తాను..అసలు మా కుటుంబంలో ఈ రోజు తిన్నది నేనే మొదటిదాన్ని అనుకుంటాను.." అంది ఆఖరి గుడ్డు తినేస్తూ..ఇకనుండీ ఎన్ని ప్రాణులకి మోక్షం రాబోతుందో అనుకున్నాను..

శనివారం రాత్రి మళ్ళీ phone చేసిందీ.."ఉద్యోగం అయిపోయింది తాతా..నిన్న చెప్పారు..budget issues అన్నాడు మా మేనేజెర్..ఇంకేం ఉంది..సర్దుకొని అక్క దగ్గరికి వెళ్తాను.." అంటుంటే.."పోనిలే..మంచిగా రోజూ chicken biryani తింటూ relax అవ్వొచ్చు అక్కడ..ఎలాగూ గురు,శనివారాలు కూడా తింటాను అన్నావ్ కదా..." అన్నాను..
"బాబోయి.. గురువారం తిన్నందుకే నా ఉద్యోగం పోయిందేమో, ఇంక ఆ వేంకటేశ్వర స్వామి తో games ఆడితే అమెరికా నుండే పోతానేమో అనుకొని  ఇవాళ మా వాళ్ళు కోడి చేసినా నేను తినలేదు.. .అందుకే ఇంక ఆ రెండు రోజులు non-veg తినకుండానే ఉందాం అనుకుంటున్నాను..వీళ్ళందరు తింటున్నట్టున్నారు నాకు మిగిల్చకుండా..మళ్ళీ మట్లాడతా తాతా.." అంటూ వాళ్ళ తో..
"ఏమే...తినకండే..."